– మరో మూసీ చేయొద్దు
– నక్కవాగు వ్యర్ధాలన్నీ మంజీరలో కలుస్తున్న వైనం
– వాగుకు అడ్డంగా ఏటిగడ్డ లింగంపల్లిలో కల్వర్టులు
– కాలుష్య వ్యర్ధాలు, గుర్రపుడెక్క.. చేరి నీటి కాలుష్యం
– దుర్వాసన, దోమలు, ఈగలతో ఊర్లో ఉండలేని దుస్థితి
– ఏటిగడ్డ లింగంపల్లిలో మంజీర వాగును పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
– ప్రభుత్వం స్పందించే వరకు దశల వారీ ఉద్యమాలు: వక్తలు
– గుట్టుగా మంజీరలోకి కాలుష్య నీటిని వదులుతున్న ఫార్మా, ఇతర కంపెనీలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
నక్కవాగులో కలుస్తున్న కంపెనీల కాలుష్య వ్యర్ధాలు మంజీరా నదిలోకి వదలడం ద్వారా స్వచ్చమైన మంజీరాను మరో మూసీ నదిగా మార్చొద్దని సీపీఐ(ఎం) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల పరిశ్రమల్లో వెలువడే కెమికల్ వ్యర్థ జలాలను నక్కవాగులోకి వదలడంతో ఆ నీరు మంజీర వాగులో చేరుతుంది. దానివల్ల మూడు జిల్లాల ప్రజలకు ఉపయోగపడే జలాలు కాలుష్య కోరల్లో చిక్కాయని అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండలంలోని ఏటిగడ్డ లింగంపల్లిలో మంజీర వాగు వద్ద జల కాలుష్యం, గుర్రపుడెక్క ఆకును పరిశీలించారు. సుమారు 200 మంది స్థానిక ప్రజలు సీపీఐ(ఎం) నాయకుల వెంట కదిలారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్, జి.సాయిలు మట్లాడుతూ.. మంజీర వాగు పరివాహక ప్రాంతంలోని ప్రజలంతా ప్రవహించే నీటితో స్నానాలు చేయడం, ఇతర అవసరాలకు ఆ నీటిని వాడుకునే పరిస్థితి ఉండేదన్నారు. కంపెనీల వ్యర్ధాలు వచ్చి చేరడంతో మంజీర నీళ్లతో కనీసం పశువుల్ని సైతం కడగలేని ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందన్నారు. నక్కవాగులో చేరుతున్న కాలుష్య నీరంతా ఏటిగడ్డ లింగంపల్లి వద్ద మంజీరా నదిలోకి చేరడంతో నదీ జలాలన్నీ కలుషితమయ్యాయన్నారు. ఏటిగడ్డ లింగంపల్లి దిగువన 12 అడుగుల కల్వర్టు నిర్మించడం వల్ల నీరంతా వాగులో నిల్వ ఉంటుందని, దాని వల్ల గుర్రపుడెక్క చేరిందన్నారు. వాగులోంచి దుర్గందపు వాసన వెదజల్లడంతో పాటు ఈగలు, దోమలు వృద్ధి చెందడం వల్ల ప్రజలు నివసించే పరిస్థితి లేకుండా పోతుందని తెలిపారు. కల్వర్టు వల్ల వాగులో నిల్వ ఉన్న నీరే చుట్టుపక్కల వేసే బోరుబావుల్లోకి వస్తున్నాయని, ఆ నీటితో పంటలు పండించడం వల్ల ఆహార పదార్ధాలు కలుషితమవుతున్నాయని, పశువులు, పక్షులకు తాపితే చర్మ వ్యాధులు వస్తున్నాయన్నారు. నక్కవాగు కాలుష్య జలాలు మంజీరాలో చేరకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాగుకు అడ్డంగా నిర్మించిన కల్వర్టును తొలగించాలన్నారు. మంజీరా జలాలు కలుషితం కావడం వల్ల సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలోని అనేక పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రాణాధారమైన మంజీరా జలాలను పరిరక్షించేందుకు అధికారులు, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలుష్య వ్యర్ధాలను మంజీరాలో కలుపుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఏటిగడ్డ లింగంపల్లిలో ఏర్పడిన సమస్య గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, శాశ్వత చర్యలు తీసుకోకపోతే 20 కి.మీ మేర గ్రామ ప్రజలంతా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టాలని ప్రజలు నిర్ణయించారు. సీపీఐ(ఎం) నాయకులు అండగా ఉంటే తమ సమస్య పరిష్కారం కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్దంగా కదులుతామని అక్కడికి వచ్చిన వందలాది మంది మహిళలు, రైతులు, యువకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జోగిపేట ఏరియా కమిటీ కార్యదర్శి విద్యాసాగర్, నాయకులు బి.రాజు, కృష్ణ, శ్రీహరి, సదానందం, మల్లేశం, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

మంజీరలో కెమికల్ వ్యర్ధాలు కలుపొద్దు

Written by RAJU
Published on: