
భోజనం చేసిన వెంటనే మన శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడంలో నిమగ్నమవుతుంది. ఈ సమయంలో రక్త ప్రసరణ అధికంగా జీర్ణవ్యవస్థ వైపు జరుగుతుంది. అందుకే ఈ సమయంలో శారీరక శ్రమ, గాఢ నిద్ర, లేదా శరీర ఉష్ణోగ్రతకు సంబంధించి మార్పులను కలిగించే పనులు శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి. దీని ఫలితంగా జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది.
తిన్న వెంటనే చేయాల్సిన పనులు
- వజ్రాసనంలో కూర్చోవడం.. భోజనానంతరం 5 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం జీర్ణానికి ఎంతో మంచిది. ఇది కడుపు భాగంలో రక్త ప్రసరణను సమతుల్యం చేస్తుంది.
- 10 నిమిషాల నడక.. తిన్న తర్వాత కొంతసేపు నెమ్మదిగా నడవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
- గోరువెచ్చని నీరు తాగడం.. భోజనానంతరం కొద్దిగా గోరువెచ్చటి నీటిని తాగడం మంచిది. ఇది కడుపులోని కొవ్వును కరిగించడంలో జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- చేతులు, ముఖం కడుక్కోవడం.. శుభ్రతతో పాటు ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది. ఇది నీరసాన్ని కొంతవరకూ తగ్గించగలదు.
తిన్న వెంటనే చేయకూడని పనులు
- తక్షణ నిద్ర.. భోజనం చేసిన వెంటనే పడుకోవడం జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది. ఇది ఛాతీలో మంట, ఆమ్లపిత్తం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
- వ్యాయామం చేయడం.. తిన్న వెంటనే బరువైన వ్యాయామాలు చేయడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
- చల్లటి నీరు తాగడం.. తిన్న వెంటనే చల్లటి నీరు తాగితే కడుపులో ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి జీర్ణక్రియ బలహీనమవుతుంది.
- టీ, కాఫీ లాంటి కెఫీన్ డ్రింక్ లు తాగడం.. ఇవి జీర్ణతంత్రంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించి, ఆమ్లతను పెంచుతాయి.
- స్నానం చేయడం.. తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మారిపోతుంది. ఇది రక్త ప్రసరణను గందరగోళంగా చేసి జీర్ణశక్తిని మందగిస్తుంది.
భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలు విశ్రాంతిగా ఉండాలి. చిన్న నడక, వజ్రాసనం వంటి చర్యలు జీర్ణక్రియకు ఉపశమనం ఇస్తాయి. తిన్న వెంటనే నిద్ర, శారీరక శ్రమ, చల్లటి నీరు, స్నానం, కెఫీన్ వంటివి తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం మానేస్తే ఆరోగ్యానికి మంచిది.