-ధరణి స్థానంలో అందుబాటులోకి..
-కలెక్టర్, ఆర్డీవోలకు అధికారం
-ప్రతీ సమస్యకు పరిష్కార మార్గం
-నేటి నుంచి అవగాహన సదస్సులు
జగిత్యాల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూ భారతి (రికార్డ్ ఆప్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025ను అమల్లోకి తీసుకు రావడానికి అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ధరణిలో లేనటువంటి పలు అంశాలను పరిష్కరించేలా కొత్త చట్టంలో నిబంధనలను రూపొందించింది. ఏ సమస్యను ఎవరు… ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి.. అది పరిష్కారం కాకుంటే ఎలా అప్పీల్‌కు వెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సీసీఎల్‌ఏకు వెళ్లే అవకాశం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఆర్డీవో, కలెక్టర్లకు అధికారాలను అప్పగించింది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో అమల్లోకి తీసుకువచ్చారు. అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా మార్పులు చేర్పులతో రాష్ట్రమంతటా అమలు చేయాలని సంకల్పించింది. జూన్ 2 నుంచి భూ భారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొని రావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భూ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా గైడ్‌లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం వాటిని రైతులకు తెలియజేసే దిశగా ముందుకు సాగుతోంది. కొత్త చట్టం అమలుపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్ని మండలాల్లో నూతన చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించారు.
ఫప్రతీ సదస్సుకు హాజరుకానున్న కలెక్టర్
భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రెవెన్యూ సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా అధికారులు ఏయే మండలంలో ఏయే రోజు సదస్సు నిర్వహించాలి…సదస్సుకు ఎవరెవురు హాజరు కావాలి అనే దానిపై షెడ్యూల్ తయారు చేశారు. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17 నుంచి 30 వరకు సెలవు రోజులు మినహాయించి పదకొండు రోజుల పాటు భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అన్ని మండల కేంద్రాల్లో సదస్సులు జరగనున్నాయి. రోజుకు రెండు మండలాల్లో సదస్సులు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ సదస్సుకు కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది హాజరుకానున్నారు. వీరితో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మండల స్థాయి సదస్సుకు అన్ని గ్రామాల రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త చట్టం ప్రకారం రెవెన్యూ శాఖకు సంబంధించి ఏ సమస్య…ఏ స్థాయిలో…ఎవరి వద్ద పరిష్కారమవుతుందో వివరిస్తారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఎవరిని సంప్రదించాలి అనే విషయాలను తెలియజేస్తారు. కొత్త చట్టంపై రైతులకు ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేస్తారు.
ఫఆర్‌వోఆర్‌లో తప్పుల సవరణకు..
భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు గాను అర్హులైన వారు నూతన చట్టం వచ్చిన యేడాదిలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. కలెక్టర్, ఆర్డీవో ఈ దరఖాస్తులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే కలెక్టర్, భూమి ట్రిబ్యునల్‌లో అప్పీలు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకే రోజు ఉంటుంది. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగ పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డుల్లో మార్పులు చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారు. స్లాట్ బుకింగ్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఫీజు చెల్లింపు వంటి నిర్ణీత తేదీల్లో చట్టం ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాలి. దస్తావేజుతో పట్టా, ప్రభుత్వం నిర్ధేశించిన తేదీ నుంచి భూమి పటం సమర్పించాల్సి ఉంటుంది.
ఫవారసత్వ భూములకు మ్యుటేషన్..
వారసత్వ లేదా వీలునామా ద్వారా భూమి హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డులో మ్యుటేషన్ చేస్తారు. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయకుంటే ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ అవుతుంది. దీని ద్వారా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాల దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. పీవోటి, ఎల్‌టీఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకొని సాదాబైనామా క్రమబద్ధీకరణ చేస్తారు. క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.100 అపరాద రుసుమును వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డులో వివరాలను నమోదు చేసి పాస్ బుక్ జారీ చేస్తారు. ధరణిలో వీటిపై ఎలాంటి నిబంధన లేకపోవడంతో న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యేవి. భూ భారతి పోర్టల్‌లో నిర్దేశించిన నమూనాలో దరఖాస్తుదారు ఎకరానికి మ్యుటేషన్ ఫీజు రూ.2,500 చెల్లించాలి. దరఖాస్తుతో పాటు వారసుల ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం కూడా జత చేయాల్సి ఉంటుంది. తహసీల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే గడువు తర్వాత ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ అవుతుంది. భూ హక్కు కలిగిన రైతులందరికీ రూ.300 ఫీజుతో పాస్ బుక్ జారీ చేస్తారు.
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు
-సత్యప్రసాద్, కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూ భారతి చట్టంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. చట్టంపై రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి, అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నాం. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాం.