– రేంజర్ భిక్షపతిని తప్పించండి.. : కలెక్టర్‌కు ముప్పారం రైతుల గోడు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఇనుపరాతి గట్లు అటవీ బ్లాకులో 60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పట్టా భూములు న్నాయని, వీటిపై ఇప్పటికే సంయుక్త సర్వే చేశారని, రేంజర్ భిక్షపతి తమను ఆ భూముల్లో సాగు చేసుకోనివ్వడం లేదని, అతన్ని విధుల నుంచి తప్పించి, విచారణ చేసి శిక్షించాలని ముప్పారం గ్రామ రైతులు కోరారు. సోమవారం ‘ప్రజావాణి’ నేపథ్యంలో ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున హనుమకొండ కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్ పి. ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముప్పారం గ్రామ శివారు సర్వే నెంబర్లు 204, 842, 843, 844, 845, 846, 847, 47లోని వ్యవసాయ భూములకు తగిన నష్టపరిహారం ఇవ్వకుండా ఆక్రమించి రైతులను సేద్యం చేయకుండా అడ్డు కొని బెదిరించి అక్రమ కేసులు పెట్టిన ఎఫ్‌ఆర్‌ఓ భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1987 నుంచి ఈ సర్వే నెంబర్ల నుంచి కొంత భూమిని అటవీ ప్రాంతంగా గుర్తించటానికి అధికారులు ప్రతిపాదనలు పంపారని తెలిపారు. తమ భూముల విలువ ఎకరానికి రూ.40- 50 లక్షలు ఉంటుందని, కొన్నేండ్లుగా ఈ భూములను తాము సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నా మని అన్నారు. ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ రాలేదని చెప్పారు. ఫారెస్ట్ రేంజర్‌గా భిక్షపతి వచ్చాక భూములు ఆక్రమించి ట్రెంచ్‌లు కట్ చేసి తమను వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడమే కాకుండా కేసులు పెట్టారని ఆరోపించారు. దుక్కి దున్నడానికి ట్రాక్టర్లు వస్తే వాటిని సీజ్ చేయించారని అన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకొచ్చాక, కలెక్టర్‌గా మీరు స్పందించి స్వయంగా భూములను పరిశీ లించి జాయింట్ సర్వే చేయించి ఇనుపరాతి గట్లు, పట్టా భూములకు మధ్య సరిహద్దులను ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. ఈ విషయం రేంజర్ భిక్షపతికి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చాక కూడా రేంజర్ భిక్షపతి ఆ ఉత్తర్వులను ఖాతర్ చేయకుండా రైతులు వ్యవసాయం చేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వులతో సంబంధం లేదని, అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవంటూ తమను అడ్డుకుంటున్నారని అన్నారు. ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేకుండానే రేంజర్ భిక్షపతి దేవునూరు గ్రామ రైతులను బెదిరించి వారి నుంచి డబ్బులు తీసుకొని ఆక్రమణలో ఉన్న భూములు దున్నుకోవడానికి అనుమతిచ్చారని ఆరోపించారు. తమ పట్టా భూముల్లో వ్యవసాయం చేయాలంటే ఎకరానికి రూ.2లక్షలు ఇవ్వాలని, దేవునూరు గ్రామానికి చెందిన మాజీ వాచర్ కమలాకర్ ద్వారా డిమాండ్ చేయించాడన్నారు. అయినా తాము డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. అవినీతికి పాల్పడిన ఫారెస్ట్ రేంజర్ భిక్షపతిని విధుల నుంచి తప్పించి, అతని అవినీతిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటవికి కేటాయించిన పట్టా భూములకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే మండలంలో మరో ప్రాంతంలో భూమికి బదులుగా భూమిని కేటాయించాలని కోరారు. ఇదే విషయమైన హనుమకొండ జిల్లా అటవీ శాఖాధికారి లావణ్యను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.