భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం

Written by RAJU

Published on:

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

సంస్థాన్‌నారాయణపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): వాన నీటిని సంరక్షించి భూగర్భజలాలను పెంచడమే వాటర్‌ షెడ్‌ పథకం ముఖ్య ఉద్దేశమని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. మండలంలోని పుట్టపాక గ్రామంలో ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన వాటర్‌ షెడ్‌ యాత్రను జాయింట్‌ కమిషనర్‌ నరసింహులుతో కలిసి ప్రారంభించారు. చెక్‌ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బస్టాండ్‌లో శ్రమదానం చేసి మొక్కలు నాటారు. యాత్రలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ హైస్కూల్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోనే మొదటగా పుట్టపాకలో వాటర్‌షెడ్‌ యాత్రను ప్రారంభించామన్నారు. మండలంలోని జనగాం సెక్టారు కింద 250 మందికి జీవనోపాధి కల్పించేందుకు రూ.1.41కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సభ్యులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో నాగిరెడ్డి, జిల్లా అటవీ అధికారి పద్మజారాణి, భూగర్భజల శాఖ డీడీ జ్యోతికుమార్‌, తహసీల్దార్‌ కృష్ణ, ఎంపీడీవో ప్రమోద్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌లు భాస్కర్‌, మాధవరెడ్డి పాల్గొన్నారు.

ఆస్తి పన్ను వసూళ్ల టార్గెట్‌ను అధిగమించాలి

చౌటుప్పల్‌ టౌన్‌: ఆస్తి పన్ను వసూళ్ల టార్గెట్‌ను అధిగమించాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ మునిసిపల్‌ కార్యాలయంలో శుక్రవారం ఆస్తి పన్ను వసూళ్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలపై వీరారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆస్తి పన్ను వసూళ్లను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందులో బిల్‌ కలెక్టర్లతోపాటు వార్డు ఆఫీసర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చిన జాబితాలోని ప్లాట్ల యజమానులకు ఫోన్లుచేసి అవగహన కల్పించాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ కె.నర్సింహారెడ్డి, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, డీఈఈ రాములు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ హనుమాన్‌ ప్రసాద్‌, పర్యావరణ ఇంజనీర్‌ రేణుకుమార్‌, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

Subscribe for notification