భారత్‌-పాక్‌ మధ్య యుద్దం ఖాయమన్న అంచనాకు ప్రపంచదేశాలు.. ఏ దేశం ఎటు వైపు..?

Written by RAJU

Published on:

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది. ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంతలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా ప్రకటన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది. నిజానికి, జిన్‌పింగ్ పాకిస్తాన్‌లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి, యుద్ధభూమిలో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తారని పాకిస్తాన్ ఆలోచిస్తోంది. కానీ ఇక్కడ, మద్దతు ఇవ్వడానికి బదులుగా, చైనా యుద్ధం జరిగే అవకాశంపై తన వైఖరిని స్పష్టం చేసింది. చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి, రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడే ఏ దశకైనా మద్దతు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మరోవైపు, పహల్గామ్‌ దాడి తరువాత భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఏ క్షణంలోనైనా యుద్దం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి. ఉగ్రవాదం విషయంలో భారత్‌ వైఖరికి ఇప్పటిపై పలుదేశాలు మద్దతు ప్రకటించాయి. భారత్‌ తప్పకుండా యుద్దానికి దిగుతుందని పాకిస్తాన్‌ కూడా అంచనాకు వచ్చింది. భారత్‌ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్‌కు తెలుసు. అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్‌ కోరుతోంది. సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్టు పాక్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ తెలిపారు. యుద్దం జరిగితే అణ్వాయుధాలను రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని, అందుకే యుద్దాన్ని కోరుకోవడం లేదన్నారు. భారత్‌ దాడి చేస్తే మాత్రం తాము యుద్దం చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్‌ ఆఖరికి బంగ్లాదేశ్‌ సాయాన్ని కూడా కోరింది.

భారత్‌ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ దేశాలను రక్షించాలని వేడుకుంటోంది. చాలా దేశాలు పాకిస్తాన్‌కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే భారత్‌తో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండిచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భారత వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. పాకిస్తాన్‌కు టర్కీ భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది. ఆరు ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్‌ చేరుకున్నాయి. అధునాతన డ్రోన్లను కూడా పాకిస్తాన్‌కు పంపించింది టర్కీ. టర్కీ తీరుపై భారత్‌ భగ్గుమంటోంది. బాయ్‌ కాట్‌ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది. టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపు ఇచ్చాయి. పాకిస్తాన్‌కు చైనా నుంచి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందింది.

భారత్‌కు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు మద్దతు ప్రకటించాయి. చైనా మాత్రం డబుల్‌ గేమ్‌ కొనసాగిస్తోంది. పహల్గామ్‌ దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది. భారత్‌ , పాకిస్తాన్‌లు సంయమనం పాటించాలని కోరింది. కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి చైనా మద్దతు ఇస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. భారత్-పాక్ రెండింటికీ పొరుగు దేశంగా, చైనా రెండు దేశాలు సంయమనం పాటిస్తాయని, చర్చలు, సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. మరోవైపు ఫ్రాన్స్‌ మాత్రం భారత్‌కు అండగా నిలుస్తోంది. 26 రాఫెల్‌ మెరైన్‌ యుద్ద విమానాల కోసం భారత్‌తో ఫ్రాన్స్‌ సంతకాలు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights