దక్షిణాది అయోధ్య భద్రాచలం రాములవారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. పవిత్ర గోదావరి నదీ ఒడ్డున.. మిథిలా స్టేడియంలో జానకీ రాముల పెళ్లికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భక్తులకు పంచేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర తయారయింది. చేనేత మగ్గంపై సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ బంగారు చీరను అత్యంత ప్రత్యేకంగా తయారు చేశాడు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాములకు సిరిసిల్ల నుంచి పట్టు వస్త్రాలు అందనున్నాయి.
సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు హరిప్రసాద్ శ్రీరామనవమి వేడుకల సందర్భంగా భద్రాద్రి సీతమ్మవారికి బంగారు పట్టు చీరను నేశారు. ఈ చీర కొంగులో భద్రాద్రి దేవాలయం, మూల విరాట్, దేవతామూర్తులను వచ్చే విధంగా చీరా కింది బార్డర్‌లో శంఖు, చక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ చీర మొత్తం ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’ అనే ఈ శ్లోకాన్ని 51వ. సార్లు వచ్చే విధంగా నేయడం విశేషం. చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం ఉపయోగించి, ఎనిమిది వందలపైగా గ్రాముల బరువు గల ఏడు గజాల బంగారు చీర తయారు నేశారు. ఇప్పటికే ఇలాంటి అరుదైన చీరలు నేస్తూ హరిప్రసాద్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చీరను భక్తి, శ్రద్ధతో నియమ నిష్ఠలతో తయారు చేశాడని తెలిపాడు. ఈ చీర నేయడానికి సుమారు పది రోజుల పాటు శ్రమించి నట్లు హరిప్రసాద్ తెలిపాడు. ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి, దేవాదాయ శాఖకు అందించి, చేనేత కలను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు. అలాగే ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల నేతన్నలకు పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు.
గతంలో హరి ప్రసాద్ తనకున్న మేధా శక్తినీ కూడగట్టుకుని నేత కార్మిక క్షేత్రంలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట అగ్గిపెట్టలో ఇమిడే చీర, సూది రంద్రంలో దురే చీర నేసి అబ్బురపరిచాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ, విదేశాల ప్రధాన నేతల ముఖచిత్రాలు, న్యూజీలాండ్ ప్రధానమంత్రి ముఖచిత్రం నేసి ప్రధానికి పంపించాడు హరిప్రసాద్. భారతరత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గంపై నేసి అందించారు. మొన్న దేశంలో జరిగిన జి20 సదస్సు లోగో నేసి భారత ప్రాధానమంత్రి నరేంద్ర మోడీకి అందించి మన్నలను పొందాడు. 95 ఏపిసోడ్ మన్ కి బాత్ లో హరి ప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు ప్రధాని మోదీ. ఎప్పుడు ఎదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు హరిప్రసాద్.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..