బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ..! ఇక చంద్రుడిపై బిల్డింగులు కట్టేయొచ్చు..

Written by RAJU

Published on:

జాబిల్లిపై నివశించాలని మనిషి ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నాడు. అందుకోసం ఎన్నో ప్రయోగాలు కూడా చేపట్టాడు. అలాగే చంద్రుడిపై శాశ్వత నిర్మాణాలు కూడా నిర్మించాలని ఇప్పటికే అగ్రరాజ్య అమెరికా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రునిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా జరుగుతున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. జాబిల్లి ఉపరితలంపై భవనాలు నిర్మించేందుకు బ్యాక్టీరియాతో ఇటుకలు తయారు చేశారు. ఈ ప్రత్యేక ఇటుకలను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తయారు చేయడం విశేషం. సాధారణంగా భూమిపై నిర్మాణాలు చేపట్టే ఇటుకలు చంద్రుడిపై ఉపయోగిస్తే అవి అక్కడి తీవ్రమైన వేడి, చలి కారణంగా బీటలువారే ప్రమాదముంది. దీంతో తాజాగా పరిశోధకులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.

ఇటుకల్లో పగుళ్లు నివారించేందుకు బ్యాక్టీరియాను ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ మేరకు ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను ‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌’ అనే జర్నల్‌లో ప్రచురించారు. చంద్రునిపై వాతావరణం కఠినంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఒక్కరోజులో 121 డిగ్రీల సెల్సియస్‌ దాకా పెరిగి.. మైనస్‌ 133 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోతూ ఉంటుంది. అంతేకాక తీక్షణమైన సౌర పవనాలు, తోకచుక్కలు అక్కడ సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో అక్కడ భవన నిర్మాణ చేపట్టడం అంత సులువైన పనికాదు. పైగా సాధారణ ఇటుక, ఇసుక, సిమెంట్‌ పనికిరావు. అందుకే అక్కడ బిల్డింగులు నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో ‘స్పోరోసార్సినా పాశ్చరీ’ అనే బ్యాక్టీరియాను ఉపయోగించడం ద్వారా తీవ్ర తాపం వల్ల ఇటుకల్లో కలిగే పగుళ్లను నివారించవచ్చని పరిశోధకులు నిరూపించారు.

ఇందుకోసం వారు బ్యాక్టీరియా ద్రావకాన్ని, గోరుచిక్కుడు మొక్కలతో తయారుచేసిన జిగురును, చంద్రునిపై లభించే మట్టిలాంటి పదార్ధాన్ని ఉపయోగించి ఇటుకలు తయారు చేశారు. ఈ ప్రక్రియలో ఉపయోగించిన బ్యాక్టీరియా ఆ ఇటుకల తయారీలో ఉపయోగించిన కార్బొనేట్‌ను కాల్షియం కార్బొనేట్‌గా మారుస్తుంది. ఇది గోరుచిక్కుడు జిగురుతో కలగలిసి 100 నుంచి 175 డిగ్రీల సిల్సియస్‌ వరకూ నిలదొక్కుకునే దృఢత్వాన్ని ఇటుకలకు అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం కారణంగా భవిష్యత్తులో ఇక్కడ తయారు చేసిన ఈ ప్రత్యేక ఇటుకలను చంద్రుడిపైకి తరలించి.. అక్కడ శాశ్వత నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification
Verified by MonsterInsights