బార్‌ అండ్‌ రెస్టారెంట్లు నిబంధనలు పాటించాలి

Written by RAJU

Published on:

బార్‌ అండ్‌ రెస్టారెంట్లు నిబంధనలు పాటించాలి– వాటికీ లైసెన్స్‌ జారీ చేయాలి
– తెలంగాణ వైన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, రామచంద్రారెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
బార్‌ అండ్‌ రెస్టారెంట్ల యజమానులు నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకోవాలని తెలంగాణ వైన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, రామచంద్రారెడ్డి అన్నారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వారు బార్లు ప్రారంభించగానే రెస్టారెంట్‌ను మూసేసి.. 90, 180, 360, ఎంఎల్‌ పద్ధతి మానేసి పార్సిల్‌ ఇవ్వడం ప్రభుత్వ అనుమతులకు పూర్తి విరుద్ధమన్నారు. బాటిల్‌ ఓపెన్‌ చేసి తినడానికి కావలసిన ఆహార పదార్థాలు ఇచ్చి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లోనే సౌకర్యాలందించాల్సింది పోయి ఫుల్‌ బాటిళ్లు పార్సిల్‌ ఇవ్వడం వల్ల వైన్‌ షాపుల యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు కూడా లైసెన్స్‌ జారీ చేయాలని, అప్పుడే తాము పడుతున్న కష్టాలేమిటో వారికి తెలియవస్తాయన్నారు. ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 20,620 వైన్‌ షాపులుండగా, 1386 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయని తెలిపారు. తమ వ్యాపారం వల్ల ప్రభుత్వానికి 87 శాతం రెవెన్యూ సమకూర్చగా, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల రెవెన్యూ 15 నుంచి 13 శాతమేనని స్పష్టం చేశారు. తాము పర్మిట్‌ రూములకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నామని, లైసెన్స్‌ కోసం రూ.రెండు లక్షలు చెల్లిస్తున్నామని అన్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు కూడా అదే నిబంధన పెట్టాలని, అప్పుడే తమ కష్టాలు వారికి తెలియవస్తాయని అన్నారు. తమకున్న నిబంధనలే వారికి అమలు చేయాలని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఆబ్కారి శాఖను కోరడంతో పాటు త్వరలోనే ముఖ్య అధికారులను, మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఇప్పటికైనా బార్‌ అండ్‌ రెస్టారెంట్ల వారు నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో సుధాకర్‌, విక్రం, ప్రభాకర్‌, సుభాష్‌, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights