ఏపీలో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతోంది. మండే ఎండలతో అడుగు బయటపెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండ తీవ్రతకు పలు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతన్నాయి. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిమ్మాయపాలెం లోను 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏప్రిల్ రెండవ వారానికి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప మధ్యాహ్నం సయమంలో బయటికి రాకుండా ఉండాలని కోరుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లోనే బయటి పనులు చక్కబెట్టుకోవాలని సూచిస్తున్నారు. అలాగే శరీరానికి చలువు చేసే పానీయాలు తీసుకోవాలని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.