Babu Jagjivan Ram Birthday in 2024: బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల ఆశాదీపం, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనాదక్షుడు, అసాధారణ ప్రతిభావంతుడైన వక్త.

కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ, జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్ సైన్స్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి, తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.1936-1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు. అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరైన జగ్జీవన్ రామ్ 1971 భారత-పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనే వారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు.
అలాగే.. 1935 అక్టోబర్ 19న దళితులకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. బ్రిటిష్ అధికారులపై అసమ్మతి చర్యలతో 1940లో అరెస్టయ్యారు. రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు. 1946లో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 1940 నుంచి 1977 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అనుబంధ సభ్యునిగా.. 1948 నుంచి 1977 వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రతినిధిగా కూడా పనిచేశాడు. కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు.
దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగ్జీవన్ రామ్ కీలకపాత్ర పోషించారు. అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్(ఇందిరా) పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1936 నుంచి 1986 వరకు ఐదు దశాబ్దాలకుపైగా చట్ట సభ సభ్యుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఆయన చనిపోయే 1986 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.
దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఆయన కుమార్తె మీరా కుమార్ 2009 మరియు 2014 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1928లో మజ్దూర్ ర్యాలీలో జగ్జీవన్ రామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిలో పడ్డారు. దళిత హక్కుల కోసమే కాదు.. మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనే వారు. తాను పాల్గొనడమే కాక అందరినీ చైతన్యపరిచే వారు. 1934లో భారీ భూకంపానికి బీహార్ అతలాకుతలమైతే సామాజికంగా సేవలందించి ఆర్తులను ఆదుకున్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ ముందున్నారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. అజాతశత్రువుగా భారత రాజకీయ, సామాజిక రంగాల్లో వెలుగొందిన జగ్జీవన్‌రామ్ తన 78వ ఏట కన్నుమూశారు. బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట.. అనుసరించిన ఆదర్శాలు.. చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ.. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.