– ఓయూ టెక్నాలజీ హాస్టల్‌లో ఘటన
– విద్యార్థుల రాస్తారోకో
నవతెలంగాణ-ఓయూ
హైదరాబాద్ ఓయూలోని టెక్నాలజీ హాస్టల్ బాత్ రూమ్ పైకప్పు పెచ్చులూడి పడి ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వసతి గృహంలో అన్ని రూమ్‌లలో ఇలాగే స్లాబ్ పెచ్చులు ఊడి ప్రమాదంగా ఉన్నాయని ఇప్పటికే విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో తమ ప్రాణాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మంగళవారం యూనివర్సిటీలో రాస్తారోకో నిర్వహించారు. హాస్టల్ బాత్రూం పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయని గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నూతన హాస్టల్ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల రాస్తారోకో నేపథ్యంలో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూకు వెళ్లే రహదారులను బంద్ చేశారు.విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ ప్రొ.రమేష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీనునాయక్, వార్డెన్, అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన విద్యార్థిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయంత్రం ఈ విషయాన్ని వారు ఓయూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.