కనిపించని సర్కారు టీచర్ల ప్రచారం
క్షేత్రస్థాయికి వెళ్లని 65 శాతం మంది..
పిల్లలతో ఇంటి ఎదుట ఫొటోలు దిగి గ్రూప్‌లో అప్‌లోడ్
నీరుగారుతున్న లక్ష్యం
హైదరాబాద్ సిటీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): బడీడు పిల్లలు, వివిధ కారణాలతో స్కూల్ మానేసిన విద్యార్థులను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన బడిబాట కార్యక్రమం లక్ష్యం నీరుగారిపోతోంది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో చాలామంది ఉపాధ్యాయులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇంటిలో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ప్రధానోపాధ్యాయుల ఒత్తిడి మేరకు ఇంటి చుట్టుపక్కల పిల్లల పేర్లను తూతూమంత్రంగా నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ సిద్ధాంతకర్త ‘ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్’ పేరిట ప్రభుత్వం ఏటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. జూన్ 3 నుంచి 17 వరకు ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని తమ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లను పెంచేందుకు కృషి చేయాలి. జూన్ 3 నుంచి 9 వరకు ఎన్‌రోల్‌మెంట్, జూన్ 12 నుంచి 17 వరకు పాఠశాలల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రెండు వారాల పాటు జరిగే బడిబాటకు సంబంధించి ప్రభుత్వం ఒక్కో స్కూల్‌కు రూ.5వేల బడ్జెట్‌ను కేటాయించింది. దీంతో పాఠశాలల వారీగా బ్యానర్లు, కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ తిరుగుతూ నూతన చేరికలు చేయించాలి.
బంధువుల పిల్లల ఫొటోలు అప్‌లోడ్..
జిల్లాలోని ఉపాధ్యాయులు తమ పాఠశాల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు తిరుగుతూ సర్కారు బడులపై అవగాహన కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించి పిల్లలను బడిలో చేర్చేందుకు ఒప్పించాలి. పాఠశాలలో చేరడానికి అంగీకరించిన పిల్లల పేర్లు, తల్లిదండ్రుల వివరాలతోపాటు వారి ఫొటోలను తీసి మండలస్థాయిలో ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేయాలి. అయితే వేసవి సెలవులు ముగియక ముందే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంపై కొంతమంది ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో బంధువులు, ఇంటి చుట్టుపక్కల పిల్లల ఫొటోలను మొక్కుబడిగా తీస్తూ అప్‌లోడ్ చేస్తున్నారు. కాగా, ఇలా నమోదు చేస్తున్న పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే చదువుతుండడం గమనార్హం. 35 శాతం మంది టీచర్లు మాత్రమే నిబద్ధతతో పనిచేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎర్నింగ్ లీవ్స్ (ఈఎల్) ఇవ్వడం లేదు. దీంతో ఉపాధ్యాయులు బడిబాటపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
Updated Date – 2023-06-06T14:09:26+05:30 IST