– ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెల్పూర్ బ్రదర్స్ క్లాత్ స్టోర్ యజమానులు
నవతెలంగాణ-వరంగల్
బట్టల దుకాణం ఖాళీ చేయాలని బ్యాంకు అధికారులు వేధిస్తున్నారంటూ వరంగల్ బట్టల బజార్‌లోని చెల్పూరి బ్రదర్స్ యజమానులు శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇంతేజార్‌గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెల్పూరి బ్రదర్స్ క్లాత్ స్టోర్ యజమానులు వేణుకుమార్, ఆనంద్ కొనేండ్ల కిందట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సుమారు రూ.1.50 కోటి రుణం తీసుకున్నారు. ఇటీవల వ్యాపారం సరిగ్గా నడవక ఈఎంఐ కట్టకపోవడంతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా లీగల్ యాక్షన్ వేయడంతో యాక్షన్‌లో సత్యం అనే వ్యక్తి బట్టల దుకాణాన్ని కొనుగోలు చేశారు. చెల్పూరి బ్రదర్స్ ఖాళీ చేయకుండా.. ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేయడం వలన కొన్నవారు కోర్టుకు వెళ్లి ఖాళీ చేయాలని ఆర్డర్ తీసుకొచ్చారు. కోర్టు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పడంతో ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించారు. ఇంతేజార్‌గంజ్ పోలీసులు వెళ్లి షాపు ఖాళీ చేయాలని చెప్పడంతో రెండ్రోజులు తర్వాత ఖాళీ చేస్తామని షాపు యజమాని చెప్పినట్టు సమా చారం. శనివారం బ్యాంకు అధికారులు వెళ్లి ఖాళీ చేయాలని చెప్పడంతో క్లాత్ స్టోర్ యజమానులైన ఆనంద్, సృజన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులు గమనించి వెంటనే ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఇప్పటి వరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.