
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చిన్న వీడియోలు చేసే ట్రెండ్ మాత్రమే కాదు చూసే ట్రెండ్ కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే ఈ అలవాటు ఇప్పుడు మానసిక ఆరోగ్యానికే కాకుండా కళ్ళకు కూడా ప్రమాదకరమని రుజువు అవుతోంది. రీల్స్ ని నిరంతరం చూడటం వల్ల తీవ్రమైన కంటి సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత దీని వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారని చెప్పారు.
ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ, ఆల్ ఇండియా ఆప్తాల్మాలజీ సొసైటీ సమావేశంలో నిపుణులు ఈ అంశంపై చర్చించారు. ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ మాట్లాడుతూ.. స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల డ్రై ఐ సిండ్రోమ్, మయోపియా (బలహీనమైన కంటి చూపు), కంటి చికాకు, తలనొప్పి, నిద్ర సమస్యలు, మెల్లకన్ను వంటి సమస్యలు వస్తాయని చెప్పారు.
ఇందుకు సంబంధించిన ఒక కేసు గురించి డాక్టర్ లలిత్ వర్మ గుర్తు చేసుకున్నారు. ఒక విద్యార్థి కళ్ళు మంట, అస్పష్టంగా కనిపిస్తుంది అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పారు. కేసు పరిశీలనలో ఆ స్టూడెంట్ ఎక్కువసేపు రీల్స్ చూడటం వల్ల అతని కన్నీటి నాళాలు మూసుకుపోయాయని.. కళ్ళలో నీళ్లు కారడం తగ్గిందని తేలింది. వెంటనే అతనికి కంటి చుక్కలు వేసి 20-20-20 నియమాన్ని పాటించమని సలహా ఇచ్చినట్లు చెప్పారు.
రీల్స్ చూడటం వల్ల కంటి వ్యాధులు ఎందుకు పెరుగుతున్నాయంటే
ఆల్ ఇండియా ఆప్తాల్మోలాజికల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు, నిర్వాహక కమిటీ ఛైర్మన్ డాక్టర్ హర్బన్ష్ లాల్ మాట్లాడుతూ ఈ రీల్స్ ప్రజల దృష్టిని ఎక్కువ సమయం ఒకే చోట నిలిపే విధంగా రూపొందించబడుతున్నాయని అన్నారు. దీని వలన ప్రజలు రెప్పవేయకుండా స్క్రీన్‌పై దృష్టి పెట్టగలుగుతున్నారు. దీని వలన కను రెప్పలు బ్లింక్ అయ్యే రేటు 50% వరకు తగ్గుతుంది. దీనివల్ల కళ్ళు పొడిబారడం, కంటి చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఈ అలవాటును నియంత్రించకపోతే.. ఇది శాశ్వతంగా కంటి చూపును బలహీనపరుస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ప్రతిరోజూ గంటల తరబడి రీల్స్ చూసే పిల్లలు చిన్న వయసులోనే మయోపియా బాధితులుగా మారుతున్నారు.
2050 నాటికి, ప్రపంచంలోని సగం మంది మయోపియా బాధితులే..
సొసైటీ మాజీ అధ్యక్షుడు, ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ హర్బన్ష్ లాల్ ఒక పరిశోధనను ఉటంకిస్తూ 2050 నాటికి ప్రపంచ జనాభాలో 50% మంది మయోపియాతో బాధపడే అవకాశం ఉందని అన్నారు. గతంలో దృష్టి శక్తి 21 సంవత్సరాల వయస్సు వరకు స్థిరంగా ఉండేదని.. ఇప్పుడు స్క్రీన్ చూసే సమయం పెరగడం వల్ల అది 30 సంవత్సరాల వయస్సు వరకు మారుతూనే ఉందని కూడా ఆయన అన్నారు.
ఆఫీసులో పనిచేసే నిపుణులు, విద్యార్థులలో డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను, బలహీనమైన కంటి చూపు సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. దీనితో పాటు ఎక్కువ స్క్రీన్ టైమ్ చూడటం కూడా సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని చెప్పారు.
రీల్స్ చూడటం వల్ల మానసిక, సామాజిక హాని
ఆల్ ఇండియా ఆప్తాల్మోలాజికల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సమర్ బసక్ మాట్లాడుతూ.. ప్రజలు రీల్స్‌లో ఎంతగా మునిగిపోతున్నారంటే నిజ జీవితంలో మాట్లాడుకోవడం, సామాజిక సంబంధాలను విస్మరించడం మొదలు పెడతారు. దీనివల్ల చదువు, పనిపై దృష్టి పెట్టడంలో కూడా ఇబ్బంది కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.
రీల్స్ చూసే అలవాటును ఎలా నియంత్రించాలంటే
ప్రస్తుతం పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఎక్కువగా రీల్స్ చూస్తున్నారు. స్క్రీన్ ఎక్కువ సముయం చూడడం వలన కళ్ళు, తలనొప్పికి సంబంధించిన సమస్యలతో ప్రజలు వైద్యులను సంప్రదిస్తున్నారు. కళ్ళను సురక్షితంగా ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని చర్యలను సూచించారు. వీటిని పాటించడం ద్వారా కళ్ళను రక్షించుకోవచ్చు.
20-20-20 నియమాన్ని పాటించండి – ప్రతి 20 నిమిషాల తర్వాత 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరం చూడండి..ఇది కళ్ళకు ఉపశమనం ఇస్తుంది.
కళ్ళు రెప్పవేయడం అలవాటు చేసుకోండి – స్క్రీన్ చూస్తున్నప్పుడు తరచుగా రెప్పవేయండి.. తద్వారా కళ్ళు పొడిగా అవ్వవు.
స్క్రీన్ సమయాన్ని తగ్గించండి- మీరు రీల్స్ చూడటానికి గడిపే సమయాన్ని పరిమితం చేయండి. అనవసరమైన స్క్రీన్ ఎక్స్‌పోజర్‌ను నివారించండి.
డిజిటల్ డీటాక్స్ చేయండి – వారానికి కనీసం ఒక రోజు స్క్రీన్లు లేకుండా గడపండి. తద్వారా మీ కళ్ళు, మనస్సు విశ్రాంతి పొందుతాయి.
నీలి కాంతి ఫిల్టర్ ఉపయోగించండి – మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లో నీలి కాంతి ఫిల్టర్‌ను ఆన్ చేయండి లేదా యాంటీ-గ్లేర్ గ్లాసెస్ ధరించండి.
రాత్రిపూట మొబైల్ తక్కువగా వాడండి- పడుకునే ముందు స్క్రీన్ చూడటం మానుకోండి. తద్వారా కళ్ళపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సరిగ్గా నిద్రపోవచ్చు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..