ఫలించిన తుమ్మల కృషి

Written by RAJU

Published on:

ఫలించిన తుమ్మల కృషి– పెద్దవాగు మరమ్మతులకు పచ్చజెండా…
– జీఆర్ఎంబీ సమావేశంలో ఇరు రాష్ట్రాలు అంగీకారం….
– మంత్రి తుమ్మల చొరవతో సమస్యకు పరిష్కారం….
నవతెలంగాణ – అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గుమ్మడివల్లి మధ్యతరహా జలాశయం పెద్దవాగు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది.ఆంధ్రా,తెలంగాణాలో 16 వేల ఆయకట్టు పెద్ద వాగు ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులకు నిధులు కేటాయించాలని తెలంగాణా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు రాష్ట్రాల చెందిన నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి తుమ్మల వినతి మేరకు సోమవారం హైదరాబాదులో జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చించి ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేసేందుకు నిర్ణయించారు.ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా నిధులను భరించి ప్రాజెక్టుకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు బోర్డు సమావేశంలో ఆమోదించారు. ఖరీఫ్ నాటికి రైతులకు ఇబ్బందులు లేకుండా పంటలు పండించు కునేలా తాత్కాలిక మరమ్మతులు చేయాలని కూడా నిర్ణయించారు. ఇందుకు సం బంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి సమీపంలో 1980 లో మధ్యతరహా జలాశయం పెద్ద వాగును నిర్మించారు. 1200 ఎకరాల విస్తీర్ణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 వేల ఎకరాలకు నీరందించే లా 21 అడుగుల నీటిమట్టం తో ప్రాజెక్టును నిర్మించారు. ఆరంభంలో ఆయకట్టు రైతుల సంతోషాలతో వర్థిల్లిన ప్రాజెక్టు రాష్ట్రాల విభజన అనంతరం దుర్భరంగా మారింది. ప్రాజెక్టు ఆనకట్ట, 2 వేల ఎకరాల సాగు తెలంగాణాలో ఉండటం, ఆంధ్రా లోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 14 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో అధికంగా పోలవరం ముంపు లో పోయింది.దీంతో గడిచిన పదేళ్లుగా ప్రాజెక్టుకు ఏ రాష్ట్రం కూడా నిధులు ఇవ్వటం లేదు. గడిచిన 10 ఏళ్లుగా ప్రాజెక్టు అంతరాష్ట్ర సమస్యగా మారిపోయింది.ఇదే తరుణంలో గత ఏడాది ఊహించని విధంగా వచ్చిన భారీ వర్షానికి పెదవాగు కట్టకు భారీగా గండిపడింది. ప్రాజెక్టుకు గండి పడటంతో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.ఆస్తినష్టం సంభవించింది.ప్రాజెక్టు మరమ్మతులు పై రెండు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. హైదరాబాదులో సోమవారం జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టు పరిస్థితిపై నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు.సమావేశంలో పాల్గోన్న ఇరు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో అధికారులు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు నిర్ణయించుకున్నారు. ఆయకట్టు ఆధారంగా ఆయా రాష్ట్రాలు ఆ స్థాయిలో నిధులు మంజూరు చేసేలా ఆమోదం తెలుపుకున్నారు. వచ్చే సీజన్లో ప్రాజెక్టు కింద పంటలు వేసుకునేలా తాత్కాలిక మరమ్మతులు చేయాలని కూడా నిర్ణయించారు.ఎట్టకేలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ప్రాజెక్టు అవసరమైన నిధులు మంజూరుకు అవకాశం లభించింది. ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో మోక్షం లభించనుండటంతో ఆయ కట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Subscribe for notification
Verified by MonsterInsights