ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ తర్వాత వధువులో మార్పు.. కట్‌చేస్తే షాకింగ్ ట్విస్ట్! అసలేం జరిగిందంటే..

Written by RAJU

Published on:

ముంబై, ఏప్రిల్‌ 8: ఓ యువతికి కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌ కూడా గ్రాండ్‌గా చేసుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఏం జరిగిందో తెలియదు గానీ వధువు ఉన్నట్లుండి మనసు మార్చుకుంది. పెళ్లికి ససేమిరా అనుకుంది. దీంతో కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు డబ్బులిచ్చిమరీ కాబోయే భర్తను హత్య చేసేందుకు పన్నాగం పన్నింది. పథకం ప్రకారం అన్నంత పనీ చేసింది. కానీ పోలీసుల ఎంట్రీతో అసలు గుట్టు రట్టవడంతో సీన్‌ రివర్స్‌ అయింది. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మహారాష్ట్రలోని పూణేలోని అహల్యానగర్‌కు చెందిన మయూరికి, మహి జల్గావ్‌ ప్రాంతానికి చెందిన సాగర్ జయసింగ్ కదమ్‌తో పెళ్లి సంబంధం కుదిరింది. ఈ జంటకు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ తర్వాత సాగర్‌ను పెళ్లి చేసుకోకూడదని మయూరి నిర్ణయం తీసుకుంది. దీంతో కాబోయే భర్తను హత్య చేయించేందుకు సహచరుడు సందీప్‌తో కలిసి పన్నాగం పన్నింది. కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు రూ.1.50 లక్షలు ఇచ్చింది. మహి జల్గావ్‌లోని ఓ హోటల్‌లో కుక్‌గా పని చేస్తున్న సాగర్‌ను ఫిబ్రవరి 27న మాటువేసి ఐదుగురు వ్యక్తులు కర్రలతో దారుణంగా కొట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన సాగర్‌ను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో సాగర్‌ తల, వీపు భాగాల్లో బలమైన గాయాలయ్యాయి.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అసలు సంగతి తెలిసి షాకైయ్యారు. దాడి చేసిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి ప్రశ్నించగా వధువు మయూరి తమకు డబ్బులు ఇచ్చి హత్యకు పురమాయించినట్లు వెల్లడించారు. నిందితులను అహల్యానగర్‌కు చెందిన ఆదిత్య శంకర్ దంగ్డే, సందీప్ దాదా గావ్డే, శివాజీ రాందాస్ జారే, సూరజ్ దిగంబర్ జాదవ్, ఇంద్రభాను సఖారం కోల్పేగా గుర్తించారు. మరోవైపు నిందితురాలు మయూరి పరారైనట్లు గుర్తించిన పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification
Verified by MonsterInsights