– 29న ఎన్‌డీఎస్‌ఏ చైర్మెన్ తనిఖీ
– తెలంగాణ ఈఎన్సీ లేఖకు స్పందన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో ఉందని గతంలో తెలంగాణ నీటిపారుదల శాఖ రాసిన లేఖకు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ) స్పందించింది. ఈనెల 29న శ్రీశైలం డ్యామ్‌ను తనిఖీ చేసేందుకు ఎన్‌డీఎస్‌ఏ చైర్మెన్ అనిల్‌జైన్ రానున్నారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సమాచారం అందింది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ ప్లంజ్ పూల్ ఏరియాలో గుంత ఏర్పడిందనీ, దానిని సిమెంట్, కాంక్రీట్‌తో పూడ్చడం ద్వారా మరమ్మతు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ జి అనిల్‌కుమార్ ప్రత్యేకంగా లేఖ రాశారు. అలాగే పలు సమావేశాల్లోనూ చెప్పారు. కేంద్ర జల సంఘం, ఎన్‌డీఎస్‌ఏ, కేఆర్‌ఎంబీతోపాటు ఏపీ, తెలంగాణ అధికారులు పాల్గొన్న వీడియోకాన్ఫరెన్స్‌లోనూ శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూర్ ఏరియాను మరమ్మతు చేసే విషయమై తీవ్రంగానే చర్చ జరిగింది. డ్యామ్ పరిస్థితి దృష్ట్యా అప్పట్లోనే ఎన్‌డీఎస్‌ఏ చైర్మెన్ వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అయినా ఏపీ సర్కారు నుంచి శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూర్ ఏరియాలో ఏర్పడ్డ గుంతకు మరమ్మతు చేయలేదు. ఇదంతా జరిగి ఏడాది కావస్తున్నది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆలస్యమైంది. ఇంకా ఈ విషయంపై దృష్టిపెట్టలేదు. దీంతో మరోసారి ఇటీవల తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. మరమ్మతులు చేయకపోతే డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉన్నదని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌డీఎస్‌ఏ చైర్మెన్ అనిల్‌జైన్ ఈనెల 29న శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించనున్నారు. ప్లంజ్ పూర్ ఏరియాను పరిశీలిస్తారు. అక్కడి పరిస్థితిని తనిఖీ చేస్తారు. తీవ్రతను బట్టి వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఈనెల 30న హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం జరగనుంది. ఇందులో ఆనకట్టల భద్రత అధికారులు, ఇతరులు ఇందులో పాల్గొననున్నారు. ఇదిలావుండగా శ్రీశైలం డ్యామ్ నిర్వహణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం చూస్తుండగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు తెలంగాణ సర్కారు పర్యవేక్షిస్తున్నది. రెండు ప్రాజెక్టుల్లో ఏవైనా మరమ్మతులు ఉంటే చేయాలని ఎన్‌డీఎస్‌ఏ ఆదేశించింది. అలాగే ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం ఉన్నాయి.

ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్

Written by RAJU
Published on: