– ఫోన్‌ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు అధికారుల దృఢవిశ్వాసం
– ముందస్తు బెయిల్ రాకుండా న్యాయమార్గాల అన్వేషణ
నతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనబడ్డ ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావును విచారిస్తేనే అన్ని నిజాలు తేలుతాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అందుకోసం అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావును వీలైనంత త్వరగా తీసుకురావడానికి కేంద్ర హోం శాఖపై ప్రభుత్వం సైతం ఒత్తిడి తీసుకు రావాలని వారు అబిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై ఏడాది గడిచిపోయింది. ఈ కేసులో ఇప్పటి వరకూ పోలీసు అధికారులైన రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతిరావుతో పాటు ప్రణీత్‌రావులను జూబ్లీహిల్స్ ప్రత్యేక టీమ్ పోలీసులు అరెస్టు చేయడం, తర్వాత వారు బెయిల్‌పై విడుదల కావడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు నమోదయ్యే సమయానికి ప్రభాకర్‌రావుతో పాటు మరో నిందితుడు ఐన్యూస్ సీఈఓ శ్రవణ్ రావులు అమెరికాకు వెళ్లిపోయారు. వారిని తీసుకురా వడానికి రెడ్‌కార్నర్ నోటీసు ద్వారా ఇంటర్‌పోల్ సహాయాన్ని కూడా రాష్ట్ర పోలీసులు కోరారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ‘అమెరికాలో చికిత్స పొందుతున్నాను. నాకు ఈ కేసుతో సంబంధం లేదు. అవసరమైతే ఇక్కడి పోలీసు అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అనారోగ్య కారణాల వల్ల అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వండి’ అని కోరుతూ… తాజాగా ప్రభాకర్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలను కోర్టు వాయిదా వేసింది. అయితే, ప్రభాకర్‌రావును ఈ కేసులో విచారించడానికి ఉన్న అవకాశాలను ఏ మాత్రం వదులుకోరాదని దర్యాప్తు అధికారులు పట్టుదలతో ఉన్నారని తెలిసింది. అందుకోసం కోర్టులో ముందస్తు బెయిల్ రాకుండా అవస రమైన న్యాయమార్గాలపై నిపుణులతో సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా, మరో నిందితుడు శ్రవణ్‌రావు కూడా ముందస్తు బెయిల్ కోసం గతంలో పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావుకు సైతం బెయిల్ లభించకుండా చూడటానికి అవసరమైన న్యాయమార్గాలను అదికారులు అన్వేషిస్తున్నారని తెలిసింది. ప్రభాకర్‌రావును అదుపు లోకి తీసుకుని విచారిస్తేనే వారి వెనుక ఆ సమయంలో ఉన్న రాజకీయ ప్రముఖుల గుట్టు కూడా బయటకు లాగగలుగుతామని అధికారులు భావిస్తున్నారు.