– దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్
– కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల పనుల పరిశీలన
నవతెలంగాణ-కాళేశ్వరం
మే15 నుంచి 26 వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ పుష్కర పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ అన్నారు. బుధవారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద సరస్వతీ పుష్కర పనులను సంగీత నాటక అకాడమీ చైర్మెన్ అలేఖ్య పుంజాల, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆమె పరిశీలించారు. వీఐపీ ఘాట్, సరస్వతీ మాత విగ్రహం ఏర్పాటు, 100 గదుల సత్రం పనులు పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శాఖల వారీగా చేపట్టిన పనుల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆశించిన స్థాయిలో వేగంగా పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న 10 రోజులు ముఖ్యమని తెలిపారు. సరస్వతీ విగ్రహం ఏర్పాటు, హారతి ప్లాట్‌ఫామ్‌ను మే మొదటి వారం వరకు పూర్తి చేయాలని దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఘాట్, సరస్వతి విగ్రహం, సత్రం పనులు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలన్నారు. వీఐపీ ఘాట్ వద్ద శాశ్వత మరుగు దొడ్లు, షవర్స్, భక్తులు బట్టలు మార్చుకునే గదులు, లైటింగ్ పనులను మే 10వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీ ఘాట్ వద్ద అదనంగా తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని, సాలిడ్ వేస్ట్ తరలించడానికి నాలుగు వాహనాలు సిద్ధంగా ఉంచాలని, ఘాట్ పైన చలువ పందిళ్లు వేయాలని సూచించారు. 100కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుతో పాటు 125 కేవీ జనరేటర్‌ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ మల్చూర్ నాయక్, ఇరిగేషన్ ఎస్‌ఈ సత్యనారాయణ, డీపీఓ నారాయణ రావు, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, దేవాదాయ శాఖ ఈఈ కనక దుర్గాప్రసాద్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, ఇరిగేషన్ ఈఈ తిరుపతి రావు, ధార్మిక అడ్వైజర్ గోవింద రాజు తదితరులు ఉన్నారు.

ప్రత్యేక అధికారులను నియమించాలి

Written by RAJU
Published on: