(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ప్రజలు ఎమ్మెల్యేను కలవాలనుకుంటే నియోజకవర్గ కేంద్రంలో ఉండే ఆయన క్యాంపు కార్యాలయానికో ఆయన నివాస గృహానికో, జిల్లా కేంద్రానికో, అసెంబ్లీ జరిగే సమయాల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఎమ్మెల్యేను కలవడానికి గ్రామంలోని చోటామోటా లీడర్‌నో, సర్పంచునో, మరో ఇతర నేతనో వెంట తీసుకొని వెళ్లడానికి సిద్ధమవుతారు. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. తీరా వెళ్లి ఎమ్మెల్యేను కలిస్తే తమ పని ఆరోజే అవుతుందో లేదో, ఎన్ని రోజులు అవుతుందో, ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. దీంతో సామాన్య ప్రజలు అవసరాలను పక్కనబెట్టి ఎమ్మెల్యేను కలువకుండానే పైరవీకారులను ఆశ్రయించడం గ్రామాల్లో సర్వసాధారణం. ఈ సమస్యను దూరం చేయాలనుకున్నారు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రజలు తనదగ్గరికి వచ్చి వ్యయప్రయాసలకు గురయ్యే బదులు తానే వారి వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే కాకున్నా వీలైనంత త్వరలో ఆ సమస్యలు పరిష్కరించాలనుకున్నారు. అందుకు ‘‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’’ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 25 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనంలో గ్రామాలకు వెళ్లి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే వెంట ఆ వాహనంలో మండల, నియోజకవర్గ స్థాయి అధికారుల బృందం కూడా గ్రామాలకు వెళ్తుంది.
ఎమ్మెల్యే ఆన్ వీల్స్ యాప్
సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్‌ను తయారు చేయించి ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌ను నియోజకవర్గంలోని 2.28 లక్షల మంది ఓటర్ల ఐడీకి అనుసంధానం చేశారు. ఓటర్లు తమ సమస్యలను నేరుగా ఈ యాప్‌లో అప్‌లోడ్ (నమోదు) చేసుకుంటే వాటిని అధికార బృందం పరిశీలించి పరిష్కరిస్తుంది. ఎమ్మెల్యే గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు చేసే విన్నపాలను కూడా ఇందులో నమోదు చేసి వాటి పరిష్కారాలను, ఇతరత్రా సమాచారాన్ని నోటిఫికేషన్ల ద్వారా ఆయా ఫిర్యాదుదారులకు పంపిస్తారు. ప్రజలు తమ ఇంటి నుంచే తమ సమస్యను విన్నవించుకునే అవకాశం దాని స్టేటస్ తెలుసుకునే అవకాశం కల్పించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్‌ను డిజైన్ చేసి యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి ఈ యాప్‌ను నియోజకవర్గంలో ఉన్న 2,28 లక్షల మంది ఓటర్ల ఐడీలతో అనుసంధానం చేశారు. ఓటర్లు నేరుగా వారి సమస్యను శాఖల వారిగా దీనిలో నమోదు చేయవచ్చు. తెల్లకాగితంపై సమస్యను రాసి దానిని ఫొటో తీసి పెట్టినా ఫిర్యాదు నమోదవుతుంది. అధికారులు కూడా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమశాఖకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుల స్టేటస్ పరిష్కారమైతే అయ్యిందని, లేకుంటే వేరేమైనా సమస్యలుంటే వాటిని కూడా నోటిఫికేషన్ల ద్వారా నేరుగా వారి సెల్‌ఫోన్‌కే సమాచారం వెళ్తుంది.
ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనంలో..
ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనంలో రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులకు అవసరమైన సామగ్రి ఏర్పాటు చేశారు. ఈ వాహనంలోనే కొన్ని ముఖ్యమైన పరిపాలనా కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్దం చేయించారు. ఈ వాహనంలో ఎమ్మెల్యేతో పాటు ఇంకో ముగ్గురు కూర్చోవచ్చు. రెండు కంప్యూటర్లు, ఆపరేటర్లు వాహనంలో ఉంటారు.
మొదటి రోజు..
ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నుస్తులాపూర్‌లో 50 వరకు వివిధ సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో 70 శాతం వరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, ఎల్‌వోసీ, గృహ నిర్మాణ శాఖ, పోలీసు శాఖ, రేషన్‌కార్డు వంటి సమస్యలపై ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంట స్థానిక తహసీల్దార్, పోలీసు అధికారి, డాక్టర్, పంచాయతిరాజ్‌శాఖ, తదితర ప్రభుత్వశాఖల అధికారులు అందుబాటులో ఉండడంతో చిన్న చిన్న సమస్యలను అక్కడే పరిష్కరించారు. ఇతర సమస్యలపై ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు.
వారానికి మూడు రోజులు గ్రామాలకు ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’
– ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
తిమ్మాపూర్: వారానికి మూడు రోజులు ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనంలో అధికారుల బృందంతో ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్‌లో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండల స్ధాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా, రాష్ట్ర స్ధాయి అధికారులకు, అవసరమైతే సంబందిత మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంపై పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనను అభినందించారని తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధితో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనూరాధ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా యాప్‌లో నమోదైన ప్రతి సమస్యను కేటగిరి వారీగా విభజించి పరిష్కారిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి రమేష్, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌ఎల్ గౌడ్, ఒగ్గు దామోదర్, నాయకులు తమ్మనపల్లి శ్రీనివాస్ రావు, గోగూరి నర్సింహరెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, సిరిగిరి రంగారావు, పోలు రాము, రమేష్, బుదారపు శ్రీనివాస్, పోతిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, తిమ్మాపూర్ తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date – May 02 , 2025 | 01:16 AM