– హెచ్‌సీయూలో ప్రకృతిని విధ్వంసం చేయొద్దు : ప్రొఫెసర్ జి.హరగోపాల్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ఒకసారి ప్రకృతిని ధ్వంసం చేస్తే దాని పునర్నిర్మాణానికి వందల ఏండ్లు పడుతుందని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల సమస్యపై పౌర సమాజ మేధావులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూలో ప్రకృతి విధ్వంసాన్ని వెంటనే నిలిపేయాలని, అడవిని నాశనం చేయొద్దని కోరారు. అడవి ఎంతో సుసంపన్నమైన ప్రకృతి అని, చూస్తే కానీ అర్థం కాదన్నారు. ఇందులో ఎన్నో రకాల అరుదైన జాతుల పక్షులు ఉన్నాయన్నారు. హెచ్‌సీయూ భూములు ప్రభుత్వానివేనని కోర్టు తీర్పు వచ్చినప్పటికీ నైతికంగా ఆ భూమి హెచ్‌సీయూదేనన్నారు. కంచ గచ్చిబౌలి అడవిని నాశనం చేయడంపై తీవ్ర ఆందోళన చెందుతున్న అనేక మంది పౌర సమాజ సంస్థలు, మేధావులతో కలిసి మంగళవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశమై వివరించామన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని, అడవిని నాశనం చేయడాన్ని ఆపాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. దేశంలో ఏడు వందల విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ హెచ్‌సీయూని మాత్రమే భారత రాజ్యాంగంలో ప్రస్తావించారన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి 5 వేల ఎకరాలు, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి 8 వేల ఎకరాలు, ఓయూకు 2,600 ఎకరాలు ఉన్నాయన్నారు. 800 ఎకరాలు సరిపోదని ఇందిరాగాంధీ చెప్పడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సీయూకు 2,300 ఎకరాలు కేటాయించిందని గుర్తు చేశారు. అప్పటి వీసీ ముందు చూపుతో 2,300 ఎకరాలకు ప్రహరీ నిర్మించారని వివరించారు. 2,300 ఎకరాలను యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఈ ప్రకృతి విధ్వంసం జరిగి ఉండేది కాదన్నారు. ఇదే చివరి తరం కాదని, ప్రభుత్వానికి దూరదృష్టి, భవిష్యత్ తరాల పట్ల బాధ్యత ఉండాలని సూచించారు. హెచ్‌సీయూకు ఈ భూమితో పని లేదని, అడవిని ధ్వంసం చేయకుండా ప్రభుత్వమే ఫారెస్ట్ ఏరియాగా డెవలప్ చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటు వ్యక్తులకు అమ్మకూడదన్నారు. ఇప్పటికే 100 ఎకరాల భూమిని విధ్వంసం చేశారని, ఇంకా 300 ఎకరాల భూమిని వెంటనే కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు ప్రతిపక్షాల మాయలో పడి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రభుత్వం అనుకుంటున్నదని, కానీ అక్కడ ప్రకృతి విధ్వంసం పట్ల విద్యార్థులు నిరసన చేపడుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా విద్యార్థులను రెచ్చగొట్టొద్దన్నారు. ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపాలని కోరారు. ఈ సమావేశంలో విస్సా కిరణ్ కుమార్, ప్రొఫెసర్ నరసింహారెడ్డి, అరుణ్, జాన్ మైకల్ తదితరులు పాల్గొన్నారు.