పోసాని కృష్ణమురళికి మరో షాక్‌… ఉద్యోగం పేరుతో రూ.9 లక్షలు కాజేశాడని టీడీపీ కార్యాలయంలో కంప్లైంట్‌ – Telugu News | The victim filed a complaint at the TDP office alleging that Posani Krishna Murali had cheated him and taken Rs. 9 lakhs by promising to give him a job

Written by RAJU

Published on:

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె. సత్యనారాయణ శెట్టి సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు. పోసాని కృష్ణమురళీ, మహేశ్‌ అనే వ్యక్తులు వైసీపీ ప్రభుత్వం హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గచ్చిబౌలిలో కేసు పెట్టినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పారు.

డబ్బులు మోసపోవడంతో ఐదేళ్లనుండి తన ఫ్యామిలీ ఇంటికి కూడా రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నానని.. తనకు ఇప్పుడు చావే శరణ్యమని.. దయ చేసి తనకు రావాల్సిన డబ్బులను పోసాని నుండి ఇప్పించి న్యాయం చేయాలని నేతలు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ లకు అర్జీ ఇచ్చి వాపోయాడు.

కాగా, చంద్రబాబుతో పాటు లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో..ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో పోసానిని అదుపులోకి తీసుకున్నారు రైల్వే కోడూరు పోలీసులు. ఇక అప్పటినుంచి పోసానికి బ్యాడ్‌టైమ్‌ స్టార్టయింది. రోజుకో కోర్టు..పూటకో పోలీస్‌ స్టేషన్‌ అన్నట్టుగా అతడి పరిస్థితి మారిపోయింది. అయితే ఎట్టకేలకు ఆదోని, విజయవాడ, రాజంపేట, నరసరావుపేట కేసుల్లో కోర్టులు బెయిల్‌ మంజూరు చేశాయి. దీంతో కర్నూలు జైలులో ఉన్న పోసాని విడుదలకు లైన్‌ క్లియరయింది. అయితే ఇంతలోనే పోసానిపై పీటీ వారెంట్‌ జారీ చేసింది..సీఐడీ. దీంతో పోసాని విడుదలకు బ్రేక్‌ పడింది.

కర్నూలు జైలు నుండి పోసానిని అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు..గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు గుంటూరు పోలీసుల పీటీ వారెంట్ కొట్టేయాలంటూ పోసాని దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది..ఏపీ హైకోర్టు.లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టడానికి ముందే పీటీ వారెంట్ జారీ చేయడంతో..క్వాష్ చేయడానికి నిరాకరించింది ఉన్నతన్యాయస్థానం. మరోవైపు టీటీడీ చైర్మన్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బాపట్ల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులో..పోసానికి పీటీ వారెంట్ జారీ చేసింది తెనాలి కోర్టు. ఈ వరుస పరిణామాలు చూస్తుంటే..వరుస కేసుల వ్యవహారం నుండి పోసానికి ఇప్పట్లో మోక్షం కలిగే సూచనలు కనిపించడం లేదు.

Subscribe for notification