పోలీసులను బట్టలూడదీసి నిలబెడతానంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. జగన్ కామెంట్లను పలువురు పోలీసులతోపాటు పోలీసుల అధికారుల సంఘం కూడా ఖండించింది. తన కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ జగన్ మాత్రం తన నోటికి మరోసారి పనిచెప్పారు. పోలీసులను ఈ ప్రభుత్వం వాచ్ మెన్ లకంటే ఘోరంగా వాడుకుంటోందని జగన్ తాజాగా చేసిన కామెంట్లు మరోసారి రాజకీయ కాక రేపాయి.
రామగిరిలో ఎంపీటీసీలను స్థానిక ఎస్సై, ఎమ్మెల్యే ప్రలోభ పెట్టారని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు వైసీపీ భయం పట్టుకుందని, రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా ఆయనకు రాదని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. హామీల అమలులో, పాలనలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు.
అయితే, తాజాగా జగన్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 11 స్థానాలు మాత్రమే తెచ్చుకున్న పార్టీ అధినేత ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో స్థానిక సంస్థలు ఎలా జరిగాయో జగన్ మరచిపోయారని, టీడీపీ, జనసేన అభ్యర్థులను వారు ఎలా బెదిరించారో, కనీసం నామినేషన్ కూడా వేయించకుండా ఎలా భయపెట్టారో గుర్తు చేసుకోవాలని అంటున్నారు. 11 నుంచి సింగిల్ డిజిట్ కు పడిపోయే చాన్స్ వైసీపీకి ఉందని, కాబట్టే జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఏకిపారేస్తున్నారు.
The post పోలీసులు వాచ్ మెన్ లట..జగన్ మారలేదు! first appeared on namasteandhra.