
వారంతా స్నేహితులు.. ఊర్లోని పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు.. అంతా ఆటలో మునిగిపోయారు.. ఈ క్రమంలో ఊహించని ప్రమాదంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. ఫోన్ మాట్లాడుతుండంగా.. అప్పుడే పిడుగు పడింది.. దీంతో ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు.. చెవి, తల, ఛాతీపై కాలిన గాయాలయ్యాయి.. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషాద ఘటన కేరళలోని అలప్పుజలో చోటుచేసుకుంది. కేరళలోని అలప్పుజకు చెందిన 30 ఏళ్ల యువకుడు అఖిల్ పి శ్రీనివాసన్ క్రికెట్ ఆడుతున్నప్పుడు పిడుగుపాటుకు గురై మరణించాడు. ఆ యువకుడు పుతువల్ లక్షంవీడు కాలనీ నివాసిగా స్థానికులు తెలిపారు. కేరళలోని అలప్పుజ జిల్లాలోని కొడుప్పున అనే గ్రామంలో వరి పొలంలో యువకులంతా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ దురదృష్టకర సంఘటన జరిగింది..
క్రికెట్ ఆడుతున్న క్రమంలో అఖిల్ ఫోన్ మాట్లాడుతున్నాడు.. సరిగ్గా ఇదే సమయంలో పిడుగు పడింది.. పిడుగు ప్రభావంతో అతని మొబైల్ ఫోన్ పేలింది.. దీంతో అతని చెవి, తల, ఛాతీ భాగాలపై తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మొదట అతన్ని సమీపంలోని ఎడతువాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ అతనికి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అతని ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే.. పిడుగుపాటుకు అతని స్నేహితుడు శరణ్ కు కూడా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
విద్యుత్ షాక్ తగిలి స్మార్ట్ ఫోన్ పేలుడు పదార్థంగా మారిందని పేర్కొంటున్నారు. ఈ సంఘటన మార్చి 16 ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగినట్లు సమాచారం. పిడుగుపాటుకు గురైనప్పుడు అఖిల్ తన జేబులోంచి ఫోన్ తీసి కాల్‌కు సమాధానం చెప్పాడని.. సరిగ్గా అదే సమయంలో పిడుగు పడిందని అతని స్నేహితులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..