సాగుకు ముందే కొంటామన్న కంపెనీలు
దిగుబడి వచ్చాక కొనుగోలుకు అడ్డగోలు నిబంధనలు
పెరిగిన సాగు విస్తీర్ణం – ఆశాజనకంగా దిగుబడి
రూ.15వేల నుంచి రూ.5వేలకు పడిపోయిన ధరలు
కొలిమిగుండ్ల, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) :
ఉమ్మడి జిల్లాలో పొగాకు రైతులను కంపెనీలు దగా చేశాయి. సాగుకు ముందు పొగాకు కొనుగోలుకు హామీ ఇచ్చి, విత్తనాలు అందించి మరీ అన్నదాతలను ప్రోత్సహించిన కంపెనీలు, దిగుబడి వచ్చాకు కొనుగోలు చేయడానికి అడ్డగోలు నిబంధనలు పెడుతున్నాయి. దీంతో అన్నదాతలు లబో దిబోమంటున్నారు. గతేడాది పొగాకు సాగు అన్నదాతలకు లాభాలు కురిపించడంతో ఈ ఏడాది మరింత ఆశతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా పొగాకు సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్త్తే ఉమ్మడి జిల్లాలో మూడింతలకు పైగా అధికంగా పొగాకు సాగైంది. మరోవైపు దిగుబడి కూడా గతేడాదికన్నా అధికంగా వచ్చినట్లు అన్నదాతలు పేర్కొంటున్నారు. గత సంవత్సరం కర్నూలు జిల్లాలో రైతులు పొగాకు 9586 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 36,471 ఎకరాల్లో సాగుచేశారు. నంద్యాల జిల్లాలో గతేడాది 8791 ఎకరాల్లో సాగుచేయగా, ఈఏడాది 30,865 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 67,336 ఎకరాల్లో రైతులు పొగాకు చేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. కాగా గత సంవత్సరం పొగాకుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో కంపెనీలు రైతుల వద్దకు వచ్చి క్వింటాలు రూ.15వేల నుంచి 16,500ల వరకు కొనుగోలు చేశారు. దీంతో అన్నదాతలు మూడింతలు అధికంగా పొగాకు సాగు చేశారు. అయితే ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లకు కంపెనీలు కొర్రీలు పెడుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. రైతులు కంపెనీల వద్దకే పొగాకు తీసుకవెళ్లి అమ్ముకుంటున్నారు. దీంతో వారు ఇష్టానుసారంగా ధరలు చెల్లిస్తూ రైతులను దోచుకుంటున్నారు. క్వింటాలుకు రూ.5000, నుంచి రూ.6500 మించి ధర పలకడంలేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలోని కోవెలకుంట్ల, బనగానపల్లె, నందికొట్కూరు, నంద్యాల తదితర ప్రాంతాల్లో కంపెనీలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాయి. దీంతో రవాణా ఖర్చులను భరించి, అంతదూరం తీసుకెళ్లాక నాణ్యత లేదని, తడిసిపోయిందని కంపెనీలు ధరల్లో కోత కోస్తున్నాయి. కొంతమంది రైతుల పొగాకు కొనకుండా వెనక్కి పంపుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని పొగాకు రైతులు కోరుతున్నారు.
Updated Date – Apr 12 , 2025 | 12:38 AM