పేదలకు అన్యాయం జరుగుతోంది.. వారందరి రేషన్‌ కార్డులను రద్దు చేయండి..

Written by RAJU

Published on:

పేదలకు న్యాయం పేరుతో చాలా రాష్ట్రాలు రేషన్‌కార్డులను అనర్హులకు ఇస్తున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హుల దగ్గర ఉన్న రేషన్‌కార్డులను రద్దు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఉచితాల పేరుతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పథకంతో పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌.. ఇలా.. ఉచితాలపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమయ్యింది. సంక్షేమ పథకాలు, పెన్షన్ల విషయంలో దేశమంతా ఒకే విధానం ఉండాలని రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రభుత్వం, విపక్షాల మధ్య చర్చ జరగాలని సూచించారు. సబ్సిడీలు కూడా రైతులకు నేరుగా అందిస్తేనే మేలు జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు , సబ్సిడీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉండడంతో పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు ధన్‌ఖడ్‌. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. అభివృద్ది చెందిన దేశాల్లో రైతులకు నేరుగా సబ్సిడీలు అందుతున్నాయన్నారు.

‘‘ఒక రాష్ట్రంలో రూపాయి పెన్షన్‌ వస్తుంటే ఇంకో రాష్ట్రంలో 10 రూపాయల పెన్షన్‌ పొందుతున్నారు. చట్టసభల్లో దీనిపై చర్చ జరగాలి. లేదంటే దీనికి ఒక హద్దు ఉండదు.. రెండో అంశం సబ్సిడీలు.. వ్యవసాయ రంగానికి సబ్సిడీలు అవసరమైతే నేరుగా ఇవ్వాలి.. అభివృద్ది చెందిన దేశాల్లో ఇదే విధానం ఉంది. అమెరికాలో ఇదే విధానం ఉంది..’’ – జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ , రాజ్యసభ ఛైర్మన్‌

రేషన్‌ కార్డుల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

మరోవైపు దేశవ్యాప్తంగా రేషన్‌ కార్డుల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాలు రేషన్‌ కార్డుల దుర్వినియోగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పేదల ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని, అనర్హుల రేషన్‌ కార్డులను రద్దు చేయాలని సుప్రంకోర్టు ఆదేశించింది. తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పే రాష్ట్రాలు కూడా బీపీఎల్ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని చెబుతాయని ధర్మాసనం పేర్కొంది.

పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని.. వాస్తవానికి మాత్రం పేదలకు రేషన్ ఫలాలు అందడం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హులే ఎక్కువగా బీపీఎల్ ప్రయోజనాలు పొందుతున్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల రేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification