పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసు విచారణపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ డీజీపీ కార్యాలయం మంగళగిరి నుంచి ఇద్దరు సభ్యుల ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేర స్థలం వద్ద క్షుణ్ణంగా పరిశీలించిందని వెల్లడించారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసుపై ఐదు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, హైదరాబాదు నుంచి విజయవాడ వరకు రెండు పోలీసు బృందాలు, విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు మరో రెండు పోలీసు బృందాలు, సీసీ ఫుటేజ్ పరిశీలన, అవసరమైన వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాదులో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులను విచారించి వారి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పురోగతిని సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, కేసు దర్యాప్తుకు సంబంధించి ఎటువంటి వదంతులు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని, విద్వేషాలు రగిల్చేలా, మతపరమైన అవాస్తవాలు ప్రచారం చేయవద్దు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సోషల్ మీడియా పోస్టులను గుర్తిస్తే, వారిపై కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. కాగా ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోలేదేని, ఆయనను హత్య చేసి ఉంటారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇది మత ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.