-
కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు
-
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
-
‘ఎలమంచిలి’ కేడర్‌తో సమావేశం
అచ్యుతాపురం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
‘‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తాం. నేను ఇక్కడి వచ్చింది భరోసా ఇవ్వడానికి కాదు. సమస్యలను పరిష్కరించేందుకే వచ్చాను.’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. సోమవారం అచ్యుతాపురంలోని జరిగిన తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ విధ్వంస పాలనపై అందరం కలసికట్టుగా పోరాడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ర్టైక్ రేట్‌తో 164 సీట్లు సాధించామన్నారు. కోటి మంది సభ్యత్వాలతో టీడీపీ ఒక చరిత్ర సృష్టించిందని లోకేశ్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం సుమారు రూ.140 కోట్లు ఖర్చుచేశామని, ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచామన్నారు. పార్టీలో యువతకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని, నాయకులు ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ‘భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని ‘ఉత్తమ కార్యకర్త’ పేరిట అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రి వంగలపూడి అనిత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, టీడీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి లోకేశ్‌కు అనకాపల్లిలో ఘన స్వాగతం
అనకాపల్లి టౌన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు సోమవారం మధ్యాహ్నం అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులకు విశాఖ నుంచి అనకాపల్లి మీదుగా అచ్యుతాపురం వెళుతున్నట్టు తెలియడంతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిపై పూడిమడక జంక్షన్‌కు చేరుకున్నారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్‌కుమార్, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, కార్పొరేషన్ల్ చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, నాయకులు కోట్ని బాలాజీ, దాడి రత్నాకర్, తదితరులు లోకేశ్‌కు స్వాగతం పలికారు. పీలా గోవింద నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. నూకాంబిక ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీనుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మంత్రి లోకేశ్‌కు ఆశీర్వచనం అందజేసి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కొత్త అమావాస్య జాతర నేపథ్యంలో ఆలయానికి వచ్చి నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవాలని ఆహ్వానించారు. కశింకోటకు చెందిన తెలుగు మహిళ నాయకురాలు పెదపాటి కల్యాణి, లోకేశ్ నుదుటన కుంకుమ దిద్దారు. ఈ సందర్భంగా పలువురు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, మాదంశెట్టి నీలబాబు, గొల్లవిల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్ 1: అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్న మంత్రి నారా లోకేశ్
లోకేశ్ 6: జనసంద్రంగా మారిన అచ్యుతాపురం జంక్షన్.
లోకేశ్ 5:అచ్యుతాపురం సభలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్
లోకేశ్‌కు బ్రహ్మరథం
-
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి అచ్యుతాపురం రాక
-
ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు
-
తొలుత ‘ఎలమంచిలి’ కేడర్‌తో సమావేశం
-
నేతలకు దిశానిర్దేశం, ఉత్తమ కార్యకర్తలకు అవార్డులు
-
అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణకు శ్రీకారం, బహిరంగ సభ
-
జనంతో కిక్కిరిసిన నాలుగు రోడ్ల జంక్షన్
అచ్యుతాపురం/ రూరల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి అచ్యుతాపురం వచ్చిన రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన విశాఖ నుంచి అనకాపల్లి జాతీయ రహదారి, మునగపాక మీదుగా సోమవారం మధ్యాహ్నం అచ్యుతాపురం జంక్షన్‌కు చేరుకున్నారు. ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి, మేళతాళాలు, వివిధ రకాల కళాకారుల ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పూడిమడక రోడ్డులో ప్రైవేటు కల్యాణమండపానికి చేరుకుని పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ‘భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వారితో సమావేశమయ్యారు. వీరికి ‘ఉత్తమ కార్యకర్త’ పేరిట అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు లోకేశ్‌తో ఫొటోలు దిగారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో బయలుదేరి ఊరేగింపుగా రెండు కిలోమీటర్ల దూరంలోని అచ్యుతాపురం జంక్షన్‌కు చేరుకున్నారు. అప్పటికి రెండు గంటల ముందు నుంచే నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో నాలుగు వైపులా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రహదారులకు ఇరువైపులా భవనాలపైనా జనం నిల్చున్నారు. లోకేశ్ రాగానే కార్యకర్తలు కేరింతలతో పెద్ద పెట్టున నినాదాలుచేశారు. అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు విస్తరణ పనులకు లోకేశ్ శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ప్రజల నుంచి ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేశ్, మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు సుందరపు విజయకుమార్, బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, పంచకర్ల రమేశ్‌బాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద, ప్రగడ నాగేశ్వరరావు, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్, సీనియర్ నేతలు పప్పల చలపతిరావు, బుద్ద నాగజగదీశ్వరరావు, లాలం భవానీ, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, తదితరులు పాల్గొన్నారు.