– ప్రధానోపాధ్యాయురాలి అప్రమత్తతతో విద్యార్థులకు తప్పిన ముప్పు
– నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ- ఇచ్చోడ
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. ప్రధానోపాధ్యాయురాలి అప్రమత్తతతో విద్యార్థులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి సీఐ భీమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. మంగళవారం ఉదయం ధర్మపురి పాఠశాలకు వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ వంటగది తాళం పగులగొట్టి ఉండటం, అందులో ఒక పాత్ర, బకెట్‌లో తెలుపు రంగులో నీరు ఉండటాన్ని గమనించారు. సామాగ్రిపై కూడా కలుషిత నీరు ఉండటం, దుర్వాసన వస్తుండటంతో మాజీ సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వారు పాఠశాలకు వచ్చి పరిశీలించగా అది పురుగుల మందు అని గుర్తించారు. వెంటనే ప్రధానోపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గోండుగూడ నివాసి అయిన సోయం కిష్టుపై అనుమానంతో విచారించారు. తానే పురుగులమందు తీసుకొచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి పాత్రల్లో పోసినట్టు అంగీకరించాడు. కిష్టు కుటుంబ కలహాల కారణంగా మానసిక పరిస్థితి బాగాలేకపోవడం, ఇంట్లో వారిపై కోపంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సంఘటనా స్థలాన్ని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ పరిశీలించారు. ఆమె వెంట సీఐ, ఎస్‌ఐ తిరుపతి ఉన్నారు.

పాఠశాలలో విష ప్రయోగం

Written by RAJU
Published on: