పల్లీల్లో ఏముంది..

Written by RAJU

Published on:

ప్రస్తుతం పచ్చి పల్లీల సమయం. పల్లీలలో పోషక విలువలు తెలపండి. అన్ని వయసులవారూ తినవచ్చా?

– రామాంజనేయులు, కాకినాడ

వేరుశెనగ గింజల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు అధికం. వీటిలో క్యాలరీలు కూడా ఎక్కువే. వంద గ్రాముల పల్లీల నుండి ఆరువందల క్యాలరీ లొస్తాయి. అయితే పల్లీల్లో తక్కువ పిండి పదార్థాలు ఉన్నాయి. అలాగే గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది మంచి ఆహారం. పల్లీలను తక్కువ మొత్తంలో తీసుకున్నప్పటికీ వాటిలోని మాంసకృత్తులు, కొవ్వులు, పీచుపదార్థాల వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల వేయించిన చిరుతిళ్ల స్థానంలో వేరుశెనగ గింజలను తీసుకున్నప్పుడు బరువు నియంత్రణలో ఉంటుంది. వేరుశెనగలోని కొవ్వులో ఉండే మోనో అన్‌శాచ్యురేటెడ్‌, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తుల వల్ల శరీరంలో జీవక్రియ వేగం కొంత పెరుగుతుంది. కాబట్టి పల్లీలు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నవారు పల్లీలు తినకూడదు అనుకోవడం అపోహ మాత్రమే. మంచి ఆహారం, శారీరక వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా రోజుకు పిడికెడు పల్లీలు నానబెట్టి లేదా ఉడికించి లేదా నూనె లేకుండా వేయించి, ఇలా వివిధ రకాలుగా అందరూ తీసుకోవచ్చు. అధిక క్యాలరీలు ఉంటాయి కాబట్టి మోతాదు మించితే బరువు పెరుగుతారు. పీనట్‌ ఎలర్జీ ఉన్నవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి.

నాకు ఇరవై సంవత్సరాలు. ముఖంమీద అవాంఛిత రోమాల సమస్య ఉంది. జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతోంది. హార్మోను సమస్యల వల్ల ఇలా వస్తుందని విన్నాను. నిజమేనా? పరిష్కారమేమిటి?

– శ్రీ సుస్మిత, సికింద్రాబాద్‌

మహిళల్లో అవాంఛితరోమాలు జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో హార్మోను అసమతుల్యత ఉండడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కారణాన్ని బట్టే పరిష్కారం ఉంటుంది. అవాంఛిత రోమాలతో పాటుగా నెలసరి సక్రమంగా రాకపోవడం, బరువులో తరచూ హెచ్చుతగ్గులు ఏర్పడడం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ లాంటి లక్షణాలు ఉన్నప్పుడు దీనిని పీసీఓడీ సమస్య కింద పరిగణిస్తారు. ఇది కేవలం వైద్యుల పర్య వేక్షణలో తగిన పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారిత మవుతుంది. హార్మోను అసమతుల్యతను ఎదుర్కో వాలంటే జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు తీసు కోవాలి. ఆహారంలో ముఖ్యంగా రక్తంలో గ్లూకోజును సక్రమంగా నియంత్రించగలిగే పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లు కూడా ముఖ్యం. గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు మొదలై నవి అధిక మోతాదులో తీసుకోవాలి. పండ్లు మితంగా తీసుకోవచ్చు. చక్కెర, తీపి పదార్థాలు (బెల్లం, తేనె కూడా), తెల్ల బియ్యం, మైదా, ఫాస్ట్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌ మొదలైనవి పూర్తిగా మానెయ్యాలి. రోజూ కనీసం గంటసేపు, ఐదు కిలోమీటర్లు నడవడం వల్ల ఉపయోగం ఉంటుంది. జుట్టు రాలి పోవడమనే సమస్య పోషక లోపాల వల్ల కూడా వస్తుంది. రక్త పరీక్షల ద్వారా పోషక లోపాలను గుర్తించి తగిన సప్లిమెంట్లను నిపుణుల సలహామేరకు తీసుకోవాలి.

నాకు నలభై ఏళ్ళు. కాఫీ అంటే ఇష్టం. రోజుకు నాలుగైదు సార్లైనా కాఫీ తాగుతాను. ఎక్కువ సార్లు కాఫీ తాగితే ఏవైనా ఆరోగ్య సమస్యలొస్తాయా?

– నవీన్‌ కృష్ణ, తాడిపత్రి

కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన పానీయం. దీనిలో ఉండే కెఫీన్‌ శరీరానికి మంచి శక్తిని అందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఉత్సాహంగా పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంది. కాఫీ తాగడం వల్ల టైప్‌ 2 డయాబెటీస్‌, పార్కిన్సన్‌, అల్జైమర్స్‌ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కెఫీన్‌కు నిద్రను దూరం చేసే లక్షణం ఉంది. కాబట్టి నిద్రా సమయానికి ఆరేడు గంటల వ్యవధి కన్నా తక్కువ ఉన్నప్పుడు కాఫీ తీసుకుంటే నిద్ర పై ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. అందుకే రోజుకు రెండు లేదా మూడు కప్పులకు మించకుండా కాఫీ తాగాలి. అలాగే సాయంత్రం మూడు లోపలే అయితే మంచిది.

ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ బ్లాక్‌ కాఫీ వల్లనే అధికం. పాలు, చక్కెరతో కలిపి కాఫీ తాగినప్పుడు క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా చేరతాయి. అందుకే జాగ్రత్త అవసరం.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Subscribe for notification