పరగడుపున వెల్లుల్లి తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని విన్నాను, నిజమేనా?
– శ్రీజ, కర్నూల్
ఆహారానికి చక్కటి వాసన, రుచిని అందించే వెల్లుల్లి తరచూ వాడకంలో ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ (గంధకం) కలిగిన రసాయనాలు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరు స్తాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచేందుకు, రక్తపోటును అదుపులో ఉంచేందుకు, గుండె జబ్బులను దూరంగా ఉంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుంది. అల్జీమర్స్, డెమెన్షియా లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశాన్ని కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది. పచ్చి వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థానికి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ అల్లిసిన్ వెల్లుల్లిని వేడి చేసినప్పుడు నశిస్తుంది కాబట్టి పచ్చి వెల్లుల్లిని తీసుకోగలిగినవారు ఈ అల్లిసిన్ అనే పదార్థం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశం ఉంది. కానీ అల్లిసిన్‌తో పాటుగా ఉండే మిగతా పదార్థాలు వేడి చేసిన తరువాత కూడా వెల్లుల్లిలో లభిస్తాయి కాబట్టి పచ్చి వెల్లుల్లి తినలేని వారు వెల్లుల్లిని వంటకాల్లో చేర్చుకొని కూడా తీసుకోవచ్చు. ప్రత్యేకించి పరగడుపున తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలున్నట్టు శాస్త్రీయ పరిశోధనల రుజువులు లేవు.
నాకు ఇరవయ్యేళ్లు….కొంత కాలంగా జుట్టు రాలిపోవడం, పొడిబారిపోవడం లాంటి సమస్యలు పెరిగిపోయాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఏవైనా సప్లిమెంట్లు తీసుకోవాలా? సూచించండి.
– అంజలి, ఖాజీపేట
జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, చేప, గుడ్లు వంటి మాంసాహారంతో పాటు పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీటిని రోజులో ఓసారి తప్పనిసరిగా తీసుకోవాలి. కేవలం ప్రొటీన్లు మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన ఐరన్, జింక్, సెలీనియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. చికెన్, మటన్, చేప, రొయ్యలు, గుడ్లు లాంటి మాంసాహారంతో పాటు కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు ధాన్యాలు; బాదం, పిస్తా, వాల్నట్స్, అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
వీటి వల్ల జుట్టుకు అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొంత లభిస్తాయి. మీకు విటమిన్ ‘డీ’ తక్కువగా ఉన్నా సరే జుట్టు రాలే సమస్య వస్తుంది. ఒకవేళ విటమిన్ డీ చాలా తక్కువగా ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. రోజూ ఇరవై నిమిషాలు ఎండలో గడపడం వల్ల కొంత విటమిన్ డీ ని పొందవచ్చు. నిద్రలేమి కూడా జుట్టు రాలడానికి కారణం. నిద్ర సమయానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోవడం, నిద్రపోయేముందు మెడిటేషన్ చేయడం లేదా ఏదైనా పుస్తకం చదవడం వంటివి చేస్తే కొంత వరకు నిద్రలేమి సమస్య తీరుతుంది. సప్లిమెంట్లను కేవలం సంబంధిత వైద్యుల సలహాతో మాత్రమే వాడాలి.
కిడ్నీ వాపు ఉన్నవారు ఎటువంటి ఆహారపు జాగ్రత్తలు పాటించాలి?
– రంజన్, విజయవాడ
కిడ్నీ వాపు లేదా నెఫైట్రిస్ ఉన్నవారు వ్యాధి తీవ్రత, వాడే మందుల్ని బట్టి ఆహార నియమాలను పాటించవలసి ఉంటుంది. రక్తంలో ఎలకో్ట్రలైట్ల పరిమాణం ఆధారంగా ఆహారంలో ఉప్పు, పొటాషియం అధికంగా ఉండే కొన్ని రకాల పదార్థాలను మితంగా తీసుకోవాలి. నీళ్లు తాగే విషయంలో, మరేదైనా ద్రవపదార్థాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు వహించాలి. ఇవన్నీ కూడా వ్యాధి తీవ్రతను అంచనా వేసి, మీ మెడికల్, రక్తపరీక్ష రిపోర్టులను పరిశీలించిన మీదటే వైద్యులు సూచించగలుగుతారు. ఆహారంలో చక్కెర, తీపి పదార్థాలను మానెయ్యడం, అన్ని రకాల వేయించిన ఆహారానికి దూరంగా ఉండడం, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండడం మాత్రం తప్పని సరి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)