పది ఫలితాల్లో 96.89 శాతం ఉత్తీర్ణత

Written by RAJU

Published on:

– రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచిన జిల్లా

– మళ్లీ బాలికలదే పైచేయి

– జూన్‌ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలుర కంటే బాలికలు 0.57 శాతం మంది ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పదో తరగతి ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 96.89 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచారు. గత ఏడాది కంటే 0.57 శాతం ఉత్తీర్ణత పెరగగా, రాష్ట్రస్థాయిలో రెండు స్థానాల్లో వెనుకబడింది. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 7,387 మంది విద్యార్థులు హాజరు కాగా, 7,157 మంది 96.89 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 3698 మంది బాలురకు గాను, 3,554 మంది 96.11 శాతం ఉత్తీర్ణులయ్యారు. 3,689 మంది బాలికలకు గాను, 3,603 మంది 97.67 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పెద్దపల్లి మండలం నిట్టూరు జడ్పీ స్కూల్‌కు చెందిన కె నిత్యామీనా 584 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు. కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి జడ్పీ స్కూల్‌కు చెందిన వైద్య శ్రీవరుణ్‌ 572 మార్కులు, జూలపల్లి మండల కేంద్రంలోని జూలపల్లి బాలుర పాఠశాల విద్యార్థి పి అశ్విత 568 మార్కులు సాధించారు.

– వివిధ పాఠశాలల వారీగా ఫలితాలు..

జిల్లాలోని వివిధ యాజమాన్యాల వారీగా ఫలితాల్లో బీసీ గురుకుల విద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన 328 మందికి గాను 324 మంది ఉత్తీర్ణులయ్యారు. కస్తూర్భాగాంఽధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో 424 మందికి గాను 420 మంది ఉత్తీర్ణులయ్యారు. మోడల్‌ స్కూల్లో 555 మంది విద్యార్థులకు గాను 543 మంది ఉత్తీర్ణులయ్యారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 69 మందికి గాను 69 మంది పాసయ్యారు. మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో 133 మందికి గాను 133 మంది విద్యార్థులు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 452 మందికి గాను 449 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో 2,420 మందికి గాను, 2,260 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో 3,012 మంది విద్యార్థులకు గాను, 2,950 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

– 59 ప్రభుత్వ విద్యాలయాల్లో వంద శాతం ఉత్తీర్ణత..

పది ఫలితాల్లో జిల్లాలోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, వివిధ గురుకుల విద్యాలయాల్లో 59 పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ధర్మారం మండలం జడ్పీ స్కూల్‌ నంది మేడారం, సాంఘిక సంక్షేమ శాఖ మల్లాపూర్‌ గురుకుల పాఠశాల, జడ్పీ దొంగతుర్తి, తెలంగాణ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల నందిమేడారం, జడ్పీ స్కూల్‌ నర్సింహులపల్లి, కొత్తూరు, కేజీబీవీ ధర్మారం, పాలకుర్తి మండలం కేజీబీవీ పాలకుర్తి, జడ్పీ స్కూల్‌ కుక్కలగూడూర్‌, జయ్యారం, పాలకుర్తి, రామగుండం మండలం కేజీబీవీ రామగుండం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రామగుండం, మైనార్టీ గురుకుల విద్యాలయం రామగుండం, రామగిరి మండలం జడ్పీ స్కూల్‌ రామయ్యపల్లి, పెద్దపల్లి మండలం మైనార్టీ గురుకుల విద్యాలయం పెద్దపల్లి, జడ్పీ స్కూల్‌ రాగినేడు, బాలుర పెద్దపల్లి, బాలికల పెద్దపల్లి, రాఘవాపూర్‌, నిట్టూర్‌, పెద్దబొంకూర్‌, మూలసాల, మారేడుగొండ, బీసీ గురుకులం రంగంపల్లి పాఠశాలల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూలపల్లి మండలం జడ్పీ స్కూల్‌ వడుకాపూర్‌, బాలికల పాఠశాల జూలపల్లి, ఎలిగేడు మండలం జడ్పీ స్కూల్‌ ఎలిగేడు, ధూళికట్ట, సుల్తాన్‌పూర్‌, సుల్తానాబాద్‌ మండలం జడ్పీ స్కూల్‌ గర్రెపల్లి, బాలికలు సుల్తానాబాద్‌, బాలుర సుల్తానాబాద్‌, పూసాల, సాంబయ్యపల్లి, కనుకుల, కేజీబీవీ సుల్తానాబాద్‌, మోడల్‌ స్కూల్‌ సుల్తానాబాద్‌, బీసీ గురుకులం సుల్తానాబాద్‌, ఓదెల మండలం జడ్పీ స్కూల్‌ ఓదెల, పొత్కపల్లి, కొలనూర్‌, న్యూ కనగర్తి, గుంపుల, కేజీబీవీ ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలం జడ్పీ స్కూల్‌ కూనారం, గంగారం, మంగపేట, మొట్లపల్లి, పందిళ్ల, పెగడపల్లి, ముత్తారం మండలం జడ్పీ స్కూల్‌ ముత్తారం, పోతారం, ఖమ్మంపల్లి, కేజీబీవీ ముత్తారం, మంథని మండలం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం మంథని, జడ్పీ స్కూల్‌ కన్నాల, కేజీబీవీ రామగిరి, కేజీబీవీ అంతర్గాం పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఫలితాలను సాధించారు.

– రీ కౌంటింగ్‌ ఒక్కో సబ్జెక్ట్‌కు రూ. 500..

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయని డీఈవో మాధవి తెలిపారు. ఈ పరీక్షలకు మే 16వ తేదీ లోపు ఫీజు చెల్లించాలన్నారు. రీ కౌంటింగ్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు, రీ వాల్యూయేషన్‌, జవాబు పత్రాల నకలు కోసం ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయలు చెల్లించాలన్నారు. రీ వాల్యూయేషన్‌, రీ కౌంటింగ్‌ కోసం ఫీజులు చెల్లించే వారు వాటి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సూచించారు.

Updated Date – May 01 , 2025 | 12:42 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights