పదమూడేళ్ల ప్రాయం.. మసస్తత్వం, మనోవికాసంపై పుస్తకం! ఎవరా అమ్మాయి? ఏమా కథ?

Written by RAJU

Published on:

రాయడం ఒక నైపుణ్యం (skill) మాత్రమే. కానీ ఆకట్టుకునేలా రాయడం ఒక కళ (art). అది సాధించాలంటే ఎంతో సాధన, లోతైన పరిశీలన కావాలి. ఎంతో జీవితానుభవం కలిగినవాళ్లే తమ జీవితాసారాన్ని అక్షరాలుగా మార్చి రచనలు చేస్తుంటారు. కానీ టీనేజ్‌లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన ఓ 13 ఏళ్ల అమ్మాయి ఈ అద్భుతాన్ని సాధించింది. ఖతార్ దేశ రాజధాని దోహాలో నివసించే తెలుగమ్మాయి శ్రేష్ట కోదాటి ఈ ఘనత సాధించింది. తత్వంతో కూడిన రచనలతో ఏకంగా ఓ పుస్తకాన్నే రాసింది. “YOU-NIVERSE” టైటిల్‌తో Exploring your inner world for outer change అనే క్యాప్షన్‌తో ఆ చిన్నారి రాసిన పుస్తకం గొప్ప రచయితలనే ఆశ్చర్చచకితులను చేస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ Amazon (అమేజాన్) ద్వారా ఈ పుస్తకాన్ని విక్రయానికి పెట్టగా.. బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఒక రచనల్లోనే కాదు.. ఇంకా ఎన్నో రంగాల్లో ప్రతిభ చాటుతున్న ఆ చిన్నారి శ్రేష్ట మంగళవారం (మార్చి 18న) భారత పార్లమెంట్‌లో ఎంపీలు విజయేంద్ర ప్రసాద్, సుధామూర్తిలను కలిసి తన పుస్తకాన్ని అందజేసింది.

హైదరాబాద్ మూలాలు.. ఎడారి దేశంలో అద్భుతాలు

శ్రేష్ట కోదాటి మూలాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులు అంజని పోచంపల్లి, రాజేంద్ర రావు కోదాటి హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవారే. ఆ తర్వాత ఖతార్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆ దేశ రాజధాని దోహాలోనే పుట్టి పెరిగిన శ్రేష్ట ఇప్పుడు దోహాలోని డీపీఎస్ మోనార్క్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 8వ తరగతి పూర్తిచేసి, 9వ తరగతిలోకి వచ్చింది. ఇంత చిన్న వయస్సులోనే తన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చి సమాజంలో పలువురికి స్ఫూర్తినిస్తూ అర్థవంతమైన ప్రభావాన్ని చూపే ప్రయత్నం చేస్తోంది.

“Words, Worlds, Wonders” అన్నవే తన మంత్రంగా ముందుకెళ్తున్నానని శ్రేష్ట చెబుతోంది. Words (పదాలు) అంటే కమ్యూనికేషన్, సాహిత్యం, Worlds అంటే సృజనాత్మక ప్రపంచం, క్రీడా ప్రపంచం, కళల ప్రపంచం అని, సానుకూల దృక్పథాన్ని, మనస్తత్వాన్ని పెంపొందించడమే తన దృష్టిలో Wonders అని వివరిస్తోంది. “ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్” సంస్థ శ్రేష్టను యంగెస్ట్ సెల్ఫ్ హెల్ప్ ఆథర్ (అతిచిన్న స్వయంసహాయక రచయిత్రి)గా గుర్తించింది.

రచనలే కాదు.. క్రీడలు, ఇతర రంగాల్లోనూ ఆరితేరిన చిన్నారి

జీవితం పట్ల ఇంత లోతైన అవగాహన కలిగిన ఆ చిన్నారి కేవలం రచనలోనే కాదు.. క్రీడలు, జిమ్నాస్టిక్స్, స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు, ఆంగ్ల భాష ప్రావీణ్యంతో పాటు బహుభాషా నైపుణ్యంలోనూ ప్రతిభ చాటుతోంది. చదువులో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఆల్ రౌండర్ అచీవర్, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ అవార్డ్ (99.9%), సైన్స్ ప్రొఫిషియన్సీ అవార్డ్ (98.84%).. ఇలా అనేక అవార్డులు, రివార్డులు సాధిస్తూ దూసుకెళ్తోంది. మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం, కొరియన్, ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడేస్థాయిలో పట్టు సాధించింది.

ఇక క్రీడల విషయానికొస్తే.. సర్టిఫైడ్ అడ్వాన్స్‌డ్ ఇన్‌లైన్ స్కేటర్‌గా నిలిచిన శ్రేష్ట, ఇంటర్-స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో మొదటి స్థానంలో నిలిచింది. ఖతార్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో రెండు పర్యాయాలు గోల్డ్ (బంగారు) మెడల్, ఒకసారి (వెండి/రజతం) సిల్వర్ మెడల్, ఒకసారి బ్రాంజ్ (కాంస్య) పతకాలను సాధించింది. 2024లో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బాల ప్రతినిధిగా ఉన్న శ్రేష్ట, 1000 మీటర్ల రోలర్ స్కేటింగ్ రేస్‌లో 2వ స్థానంలో, ఒమన్‌లో జరిగిన జీసీసీ స్కేటింగ్ నేషనల్స్‌లో వెండి (2), కాంస్య (1) పతకాలు సాధించింది.

వీటితో పాటు అనేక వేదికలపై అద్భుతమైన ప్రసంగాలతో ఆకట్టుకుని అవార్డులు, రివార్డులు పొందింది. అబాకస్ టోర్నమెంట్‌ సహా అనేక పోటీల్లో మెడల్స్ సాధించింది. అలాగే సంగీతం, నాట్యం, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, సాహయ యాత్రల్లోనూ శ్రేష్టకు ప్రవేశం ఉంది. అంతకు మించి ఆసక్తి కూడా ఉంది.

వారే నాకు స్ఫూర్తి

ప్రస్తుతం తన తల్లి అంజనితో కలిసి భారత పర్యటనలో ఉన్న శ్రేష్ట మంగళవారం పార్లమెంటులో ఎంపీలు విజయేంద్ర ప్రసాద్, సుధామూర్తిని కలిసి తన పుస్తకాన్ని అందజేసింది. ఆ తర్వాత టీవీ9తో మాట్లాడుతూ.. తనకు తల్లి అంజని పోచంపల్లి మొట్టమొదటి స్ఫూర్తి అని, ఆ తర్వాత అద్భుతమైన సినిమా కథలను అందిస్తున్న ప్రముఖ సినీ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్, అద్భుతమైన ప్రతిభతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న సుధామూర్తి తనకు స్ఫూర్తిగా నిలిచారని శ్రేష్ట పేర్కొంది. సమాజంలో మార్పు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఎలా అన్న అంశంపై పుస్తకాన్ని రచించానని, సమాజంలో మార్పు రావాలంటే ముందు మనలోనే మార్పు రావాలని చెబుతోంది. మన జీవిత లక్ష్యం ఏంటో ముందు మనం తెలుసుకోవాలని అంటోంది. చిన్నతనం నుంచే రచనలు, వక్తృత్వం, ప్రసంగాల్లో ప్రావీణ్యం ఉందని వెల్లడించింది.

పుస్తకాన్ని అందుకున్న విజయేంద్ర ప్రసాద్.. అందులో ఆ చిన్నారి ఆంగ్ల భాష ప్రావీణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని ఆయన మీడియాతో పంచుకున్నారు. “నాకు ఆంగ్లం నేర్పుతావా?” అంటూ ఆ చిన్నారితో సరదాగా ముచ్చటించారు. శ్రేష్టకు మంచి భవిష్యత్తు ఉందని, చిన్న పిల్లలను ఎక్కువగా పొగడకూడదు కాబట్టి తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడదల్చుకోలేదని అన్నారు. టీనేజిలోనే వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతూ భారతదేశ ఖ్యాతిని విదేశాల్లో చాటుతున్న శ్రేష్ట.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ, దేశ ప్రతిష్టను నలుదిక్కులా చాటాలని ఆశిద్దాం.

Subscribe for notification