కల్లూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలం కమ్మపల్లి పంచాయతీ పేరావాండ్లపల్లి వద్ద గురువారం పట్టపగలే ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది.బోడబండ నుంచి బుధవారం రాత్రి ఏనుగు మండలంలోకి ప్రవేశించింది.దేవళంపేట పంచాయతీ కుమ్మరిపల్లి మీదుగా వీకేపల్లి వద్దకు చేరుకుంది. విషయం తెలుసుకున్న ఎఫ్‌ఎ్‌సవో మహమ్మద్ షఫీ సిబ్బందితో అక్కడకు చేరుకొని స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. వీకేపల్లిలోని రైతు చిన్నదొరస్వామినాయుడు మామిడితోటకు అమర్చిన రాతి కూసాలను ఒంటరి ఏనుగు విరిచేసింది. అక్కడి నుంచి పెద్ద బెస్తపల్లి, అయ్యావాండ్లపల్లి, ఎర్రపాపిరెడ్డిగారిపల్లి సమీపంలోని కృష్ణమ్మచెరువు వద్దకు చేరుకుంది. చెరువులోని నీటిలో కొంత సమయం గడిపిన ఏనుగు పులిచెర్ల-రొంపిచెర్ల రోడ్డును దాటుకొని చిచ్చిలివారిపల్లి వద్దకు చేరుకుంది. అనంతరం తురకపేట, వంకమద్దివారిపల్లి మీదుగా ఉదయం 8 గంటల సమయానికి పేరావాండ్లపల్లి వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ప్రజలను ఏనుగు సమీపానికి వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడకు చేరుకున్న ప్రజలను గమనించిన ఒంటరి ఏనుగు గ్రామానికి సమీపంలోని తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోకి చేరుకుంది. రాత్రంతా మండలంలో తిరిగిన ఒంటరి ఏనుగు పలు మామిడిచెట్లను ధ్వంసం చేసినట్లు ప్రజలు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎఫ్‌ఎ్‌సవో
ఒంటరి ఏనుగు సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌ఎ్‌సవో మహమ్మద్ షఫీ హెచ్చరించారు. ఎక్కడైనా ఒంటరి ఏనుగు ప్రజలకు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.