నోటి పూత, నోటి దుర్వాసన సమస్యలు ఏవైనా పోషకలోపాల వల్ల వస్తాయా? చక్కని తరుణోపాయం చెబుతారా?
– ఉదయ్, నాగర్ కర్నూల్
ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే నోటి పూత వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. దంతాల శుభ్రత తగినట్టు లేనప్పుడు నోటి దుర్వాసన వస్తుంది. మనం తినే ఆహారం ఆరోగ్యపరిరక్షణకు ఎంత ఉపయోగపడుతుందో దంతాల ఆరోగ్యానికీ అంతే ఉపయోగపడుతుంది. పిండి పదార్థాలు లేదా తియ్యటి ఆహారాన్ని తినేటప్పుడు, తాగినప్పుడు నోటిలో దంత క్షయం, చిగుళ్ళ వ్యాధికి కారణమయ్యే సూక్ష్మక్రిములకు ఆహారం ఇస్తున్నట్టు. ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు నోటిలో ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ ఆమ్లాలు ఆహారం తినడం పూర్తయిన 20 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు దంతాలపై దాడి చేసి వాటి ఉపరితలంపై ఉండే ఎనామిల్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. ఇది దంత క్షయానికి దారితీస్తుంది. పీచుపదార్థం ఎక్కువ ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మన దంతాలను శుభ్రం చేసేందుకు ఉపయోగపడతాయి. పాలు, పెరుగు వంటివి ఎనామిల్‌ను నాశనం చేసే ఆమ్లాల తయారీని తగ్గిస్తాయి. పాలీఫినాల్స్ అధికంగా ఉండే గ్రీన్ టీ దంతసంరక్షణకు మంచిది. తీపి పదార్థాలు, బాగా వేడి, బాగా చల్లటి పదార్థాలు తగ్గించడంతో పాటు, ఆహారం తిన్న వెంటనే నోరు నీటితో పుక్కిలించడం, తరచూ నీళ్లు తాగుతుండడం, రోజుకు రెండుసార్లు దంతధావనం చేసుకోవడం మొదలైన ఆరోగ్యకరమైనఅలవాట్లను చేసుకుంటే దంతాలను సంరక్షించుకోవచ్చు, నోటి దుర్వాసననూ నియంత్రించవచ్చు.
నాకు 43 ఏళ్ళు. నిద్రలో ఏవైపు తిరిగి పడుకొంటే లేచాక ఆ వైపు కాస్త నొప్పిగాను, తిమ్మిర్లు గాను ఉంటుంది. కాసేపు నడక లేదా ఏవైనా పనులు చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. దీనికి ఆహారంతో ఏమైనా పరిష్కారం ఉంటుందా?
– మాధవి, విశాఖపట్నం
నరాలకు ఏదైనా సమస్య వుంటే ఇలా తిమ్మిర్లు వస్తాయి. అధిక బరువు లేదా రక్తప్రసరణలో ఏవైనా ఇబ్బందులు ఉండడం వల్ల తిమ్మిర్లు, నొప్పి వచ్చే అవకాశం ఉంది. బలమైన దెబ్బ తగలడం, అధిక రక్తపోటు, రక్తంలో చక్కర స్థాయి నియంత్రణలో లేకపోవడం, కిడ్నీ సమస్యలు, డీ, బీ 12 విటమిన్ లోపాలు, తదితర కారణాల వల్ల నరాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. రక్తపోటును నియంత్రిం చేందుకు ఆహారంలో ఉప్పును తగ్గించాలి, పొటాషియం అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉండే ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, గింజలు, ఆకుకూరలు మొదలైనవి తినాలి. తెల్లబియ్యం, మైదా, చక్కెర వంటివి మానేయాలి. ప్రతి పూటా ఆహారం తీసుకొనే ముందు కనీసం ఓ పది నిమిషాలు నడవడం మంచిది. బీ 12 విటమిన్ కోసం వెన్న తీసిన పాలు, పెరుగు వంటివి అధికంగా తీసుకోవాలి. విటమిన్ డీ కోసం రోజూ కనీసం అరగంటైనా ఎండలో గడపాలి. ఒకవేళ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటే వైద్యుల సలహాతో తగిన సప్లిమెంట్లు తీసుకోవడం కూడా అవసరం.
ఆరోగ్యానికి తెల్లనువ్వులు మంచివా లేక నల్ల నువ్వులా? నువ్వులలో ఎటువంటి పోషకాలు ఉంటాయి?
– రాధిక, రాజమండ్రి
నువ్వుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముప్ఫయి గ్రాముల నువ్వులు 3 గ్రాముల పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఆహారం ద్వారా అందే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే గాక గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం మొదలైనవాటిని దూరంగా ఉంచుతాయని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. నువ్వుల్లో అధిక శాతం ఉండే అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, లిగ్నాన్స్, ఫైటోస్టెరాల్స్ మొదలైన వాటివల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గడం,
అధిక ట్రై గ్లిసెరైడ్స్ అదుపులోకి రావడం మొదలైన ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వుల్లోని మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ మొదలైనవి అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు కూడా సహకరిస్తాయి. పొట్టు తొలగించని నువ్వుల్లో ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే క్యాల్షియం ఎక్కువ. ఐరన్, కాపర్, సెలీనియం, మాంగనీసు వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే నువ్వులు రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి మంచివి. నూనె తొలగించిన నువ్వుల పప్పు లేదా తెలగ పిండిలో మాంసకృత్తులు అధికం.
కాబట్టి ఎదిగే పిల్లలకు, బాలింతలకు, ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి తెలగ పిండి మంచి ఆహారం. నువ్వుల్లోని ఫైటో ఈస్ట్రోజన్లు మహిళల్లో మెనోపాజ్ లక్షణాలను కొంత నియంత్రిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వుల్లో కొద్దిగా క్యాల్షియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వులను పొడి చేసి కూరల్లో చల్లుకోవడం, కొద్దిగా బెల్లంతో కలిపి లడ్డులా తీసుకోవడం, తాలింపులో, రోటి పచ్చళ్లలో వాడడం ఇలా రకరకాలుగా ఆహారంలో భాగం చేసుకుంటే అందరికీ మంచిదే. అయితే అధిక క్యాలరీలు కూడా ఉంటాయి కాబట్టి రోజుకు పదిహేను గ్రాములకు మించకుండా మాత్రమే నువ్వులను తీసుకోవాలి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)