మంథని తీరంలో బ్రిడ్జి, పోతారం వద్ద హైవే పనులకు శ్రీకారం
రూ. 125 కోట్లతో శంఖుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
బ్రిడ్జికి నిధులు, ఫారెస్టు క్లియర్స్ కోసం మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక కృషి
మూడు బ్రిడ్జిలతో రెండు జిల్లాలు, రాష్ట్రాలకు రవాణా సౌకర్యం
ఎన్నో ఏళ్ళ బ్రిడ్జి, హైవే నిర్మాణాల కల సాకారమౌతున్న వేళ
పట్టణంలో పుంజుకోనున్న వ్యాపార, వాణిజ్య వర్గాలు
మంథని, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మంథని పట్టణ శివారులోని గోదావరి నది పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు, మండలంలోని పోతారం గ్రామం నుంచి గోదావరి నది వరకు నేషనల్ గ్రీన్‌ఫీల్డు హైవే పనులు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి-మంచి ర్యాల జిల్లాలను కలుపుతూ మంథని-శివ్వారం మధ్య గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులను మంథని గోదావరి నది శ్మశాన ఘాట్ కింది ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి భూమిని చదును చేసి పనులు ప్రారంభించారు. మట్టి రోడ్డును నిర్మించుకొని ఫిల్లర్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, కంకర, తదితర సామగ్రి తరలింపు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం గోదావరినదికి వెళ్ళే ప్రధాన రహదారికి అనుసంధానం చేయటానికి రహదారిని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శివ్వారం అభయా రణ్యంలో గోదావరినదిలో ఎల్.మడుగు వన్యప్రాణుల-మొసళ్ల సంరక్షణ కేంద్రం ఉం డటంతో గోదావరి పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి డిసెంబరులో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దాదాపు రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ బ్రిడ్జికి సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్ 4న శంకుస్థాపన చేశారు.
గోదావరినది పై మూడు బ్రిడ్జిలు..
గోదావరి నది పై ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంథని మండలం లోని సిరిపురం వద్ద సుందిళ్ళ బ్యారేజీ కం బ్రిడ్జిని నిర్మించారు. మహారాష్ట్ర నుంచి వరంగల్-విజయవాడకు నిర్మిస్తున్న నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా మండలంలోని విలోచవరం శివారులోని గోదావరినది పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. మంథని మండలం కన్నాల, పందులపల్లి, పుట్టపాక గ్రామ శివారుల్లో ఇప్పటికే హైవే వర్క్ ప్రారంభమయ్యాయి. హైవే బ్రిడ్జితో నది పై రెండో వంతెన నిర్మాణం కానుంది. పట్టణ శివారులోని తాజాగా గోదావరినదిపై మూడో భారీ వంతెన నిర్మాణం జరుగుతుంది.
మూడు బ్రిడ్జిలతో రవాణా సౌకర్యం
గోదావరి నదిపై అందుబాటులోకి రానున్న మూడు బ్రిడ్జిలతో పెద్దపల్లి, మం చిర్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు పెద్దపల్లి జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. మంథని నియోజకవర్గానికి సరిహద్దుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు, మంచిర్యాల జిల్లాలకు వెళ్ళాలంటే గోదావరినది అడ్డుగా ఉండేది. గోదావరిఖని, కాళేశ్వరం వద్ద మాత్రమే నది దాటడానికి బ్రిడ్జిలు అందుబాటులో ఉండగా ఇటీవల సుందిళ్ల వద్ద మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. తాజాగా మంథని-శివ్వారం మధ్య గోదావరినది పై వంతెన, నేషనల్ గ్రీన్‌ఫీల్డు హైవేలో భాగంగా విలోచవరం-గోపాల్‌పూర్ గ్రామాల మధ్య మరో వంతెన నిర్మాణం కానుంది. ఈరెండు వంతెనలతో మంచిర్యాల జిల్లాకు, జైపూర్, చెన్నూరుల మీదుగా మహారాష్ట్ర, అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్ళడానికి రవాణా సౌకర్యం మెరుగు పడనుంది.
నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు
నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను మంథని మండలంలోని కన్నాల-పందులపల్లి గ్రామాలతోపాటు పోతారం శివారులో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామ శివారు గోదావరినది నుంచి గ్రామానికి వెళ్ళే రహదారి వరకు దాదాపు వంద మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి వందలాది టిప్పర్లతో మట్టి నింపుతున్నారు. మహా రాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే-163 నిర్మాణాన్ని కేంద్రం ప్రతిపాదించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గ్రీన్స్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనుల్లో మంచిర్యాల- వరం గల్ సెక్షన్‌విభాగంలో 2 ప్యాకేజీల్లో నేషనల్ హైవేను నిర్మిస్తున్నారు. దీంతో మహా రాష్ట్ర, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక జిల్లాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
జాతీయ రహదారి సమగ్ర సమాచారం..
నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్‌ఫీల్డు కారిడార్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ. 14,666 కోట్ల నిధులతో 405 కిలో మీటర్ల ప్రాజెక్టు పొడవుగా 199.7358 హైక్టార్ల( సుమారు 5 వందల ఎకరాలు) ప్రతిపాదిత భూమిగా నిర్ణయించారు. 2027 ఈ రహదారిని పూర్తి చేయాలని కాలపరిమితి పెట్టుకున్నారు. తొలి ప్యాకేజ్ నిర్మాణం మంచిర్యాల నుంచి వరంగల్ వరకు, ప్యాకేజీ-2లో మంథని- రామగిరి- ముత్తారం మండలాల మీదుగా నిర్మిస్తారు. జిల్లాలో 16 గ్రామాల్లో 40 కిలో మీటర్ల రహదారి, రూ. 2,607 కోట్లు కేటాయించారు.
బేగంపేట, పుట్టపాక వద్ద ఫ్లైఓవర్లు
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మంథని మండలం పుట్టపాక సమీ పంలో రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే రామగిరి మండలం బేగంపట వద్ద ఫ్లైఓవర్ ప్రతిపాదిందించారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా మంచిర్యాల, పెద్దపల్లితోపాటు కరీంనగర్, జయశంకర్-భూపాలపల్లి జిల్లాల ప్రజలకు నేషనల్ హైవే రహదారి అందుబాటులోకి రానుంది.
నేషనల్ హైవే తో భూముల ధరలకు రెక్కలు..
జిల్లాలోని మూడు మండలాల పరిధిలో జాతీయ రహదారి నిర్మాణానికి అడుగులు పడినప్పటి నుంచి రహదారి మార్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దూకుడు పెంచారు. సమీపంలో వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించే పనిలో ఉన్నారు. సాధారణంగా ఎకరాకు రూ.25 నుంచి రూ.40 లక్షల వరకు పలుకుతుం డగా వ్యాపారులు రూ.కోటి పైగా చెబుతున్నారు. రైతులు సైతం తమ భూములకు డిమాండ్ పెరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date – Mar 29 , 2025 | 01:10 AM