నేడు ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్‌ ప్రారంభం

Written by RAJU

Published on:

నేడు ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్‌ ప్రారంభం– 13 దశాబ్దాల్లో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోకి సింగరేణి ప్రవేశం
– నేడు లాంఛనంగా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి
– 38 ఏండ్లు…ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం : సింగరేణి సీఎండీ ఎన్‌ బలరామ్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్‌ సంస్థ 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు తవ్వకాన్ని ప్రారంభించనుంది. ఒడిశా రాష్ట్రంలోని అంగూల్‌ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌ ను బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క లాంఛనంగా వర్చువల్‌ మోడ్‌లో ప్రారంభించనున్నారని సింగరేణి సీఎండీ ఎన్‌ బలరామ్‌ తెలిపారు. 2016 మే నెలలో ఈ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించించింది. అన్ని రకాల అనుమతులు సాధించి, గనిలో తవ్వకం ప్రారంభించడానికి తొమ్మిదేండ్ల సమయం పట్టిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ వల్లే సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్‌ లభించిందని తెలిపారు. నైనీ బొగ్గు బ్లాక్‌లో 340.78 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు తవ్వి తీయటానికి అవకాశం ఉంది. ఈ గనిలో ఉత్పత్తి పూర్తిస్థాయికి చేరుకుంటే ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని సీఎమ్‌డీ వెల్లడించారు.
సింగరేణిలో ప్రస్తుతం ఉన్న 17 ఓపెన్‌ కాస్ట్‌ గనుల కన్నా, ఇదే అతి పెద్ద గని అని తెలిపారు. ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38 ఏండ్ల పాటు ఈ గని నుంచి మేలురకం జీ-10 బొగ్గును తవ్వి తీసేందుకు అనుమతులు ఉన్నాయని ఆయన వివరించారు. ఓవర్‌ బర్డెన్‌, బొగ్గు తవ్వకం, రవాణాకు సంబంధించి ఇప్పటికే కాంట్రాక్టులను అప్పగించామన్నారు. ఈ ప్రాంతంలోని ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి, 60 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించామనీ, మరో మూడేండ్ల్లలో ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నైనీ బొగ్గు బ్లాకు కోసం మొత్తం 2,255 ఎకరాల భూమిని సేకరించారు. దీనిలో 1,935 ఎకరాల అటవీ భూమి, 320 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూమి ఉన్నదని వివరించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights