నేటి నుంచి భూ భారతి అవగాహనా సదస్సులు

Written by RAJU

Published on:

నేటి నుంచి భూ భారతి అవగాహనా సదస్సులు– ప్రత్యేక ఫార్మాట్‌లో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ
– భూ సమస్యలు లేని తెలంగాణే మా లక్ష్యం : రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భూ భారతి చట్టంపై గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులతో పాటు దాని అమలుపై ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సదస్సు లక్ష్యాలు, ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకోవడం తదితర అంశాలపై ఆయన సంబంధిత అధికారులతో బుధవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రయోగాత్మకంగా భూభారతిని అమలు చేసే నాలుగు మండలాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటికి రశీదులను అందజేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ఫార్మాట్‌లో తయారుచేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సు ముందురోజే ప్రజలకు ఇవ్వాలని సూచిచారరు. ”ఎలాంటి భూసమస్యలున్నాయి? ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? వాటిని ఏవిధంగా పరిష్కరించాలి? రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, పోర్టల్‌పై ప్రజాస్పందనను చూసి భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు వెళ్లాలి” అనే విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూములు మినహా ప్రతి దరఖాస్తును మే ఒకటి నుంచి పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. వచ్చిన దరఖాస్తులను ఏరోజుకారోజు కంప్యూటర్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించాలని వారికి సూచించారు. అవగాహన సదస్సులకు సంబంధించి కలెక్టర్లు ప్రతిరోజూ ప్రతి మండలంలో రెండు కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశాంచారు. మండల కేంద్రాల్లో తహశీల్దార్లు డిప్యూటీ తహశీల్దార్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్లు బృందాలుగా ఏర్పడి సదస్సులు నిర్వహించాలని సూచించారు. భూ సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా సర్కార్‌ భూ భారతి చట్టాన్ని తెచ్చిందనీ, అందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.
నారాయణపేట జిల్లా మద్దూర్‌లో ప్రారంభం
నారాయణ్‌పేట జిల్లా మద్దూర్‌ మండలంలోని కాజాపురం గ్రామంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ను గురువారం తానే స్వయంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లా పూడూరు గ్రామంలో జరిగే అవగాహనా సదస్సులో పాల్గొంటానని చెప్పారు. 18న ములుగు జిల్లా వెంకటాపురం, ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే సదస్సులోనూ పాల్గొంటానని మంత్రి పొంగులేటి తెలిపారు. వీటితో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈచట్టాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights