– చట్టంపై నేటి నుంచి అవగాహణ
– అన్ని మండలాల్లో నిర్వహణ
– కార్యక్రమం రూపొందించిన జిల్లా యంత్రాంగం
(కరీంనగర్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెవెన్యూ చట్టాలను మార్చి ధరణిని అమల్లోకి తెచ్చారు. ధరణి చట్టం తెలంగాణ ప్రజలకు పీడ కలగా మారిందని తాము అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని చెప్పిన కాంగ్రెస్ కొత్తగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేస్తూ ఆయా మండలాల్లో వచ్చిన సూచనలు, సమస్యలను పరిశీలించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. భూభారతితో తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొత్త భూ భారతి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకువస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ చట్టంపై సమగ్ర అవగాహనను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు మండల స్థాయిల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు నోడల్ అధికారులుగా, మండల తహసీల్ధార్లు సదస్సు నిర్వహణ బాధ్యులుగా వ్యవహరిస్తారు. ఈ నెల 17న ఉదయం 10.30 గంటలకు తిమ్మాపూర్ రైతు వేదికలో తిమ్మాపూర్ మండల స్థాయి సదస్సు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి గన్నేరువరంలో శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో సదస్సు జరుగనుంది. ఈ నెల 19న హుజూరాబాద్‌లో ఉదయం 10.30 గంటల నుంచి సాయిరూప గార్డెన్‌లో, 22న రామడుగు రైతు వేదికలో ఉదయం 10.30 గంటలకు, గంగాధర రైతు వేదికలో 12 గంటలకు భూభారతి సదస్సులు నిర్వహిస్తారు. చొప్పదండి మండల కేంద్రంలో ఈ నెల 23న రైతు వేదికలో సదస్సు జరగనున్నది. 24న మానకొండూర్ రైతు వేదికలో ఉదయం 10.30గంటలకు శంకరపట్నం మండలం వంకాయగూడెంలో మాదవ సాయిలో మధ్యాహ్నం 12 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తారు. 25న ఉదయం జమ్మికుంటలోని పాత మున్సిపాలిటీ కార్యాలయంలో, ఇల్లందకుంటలో మధ్యాహ్నం 12 గంటలకు రైతు వేదికలో ఈ సదస్సులు నిర్వహిస్తారు. కరీంనగర్ రూరల్ మండలంలో 26న ఉదయం దుర్శేడ్ రైతు వేదికలో, కొత్తపల్లి మండలంలో అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు మండల కేంద్రంలోని రైతు వేదికలో సదస్సులు జరుగుతాయి. 29న చిగురుమామిడి మండలంలోని రైతు వేదికలో ఉదయం, సైదాపూర్ మండలంలో అదే రోజు మధ్యాహ్నం సదస్సులు నిర్వహిస్తారు. వీణవంక మండల రైతు వేదికలో 30వ తేదీన ఉదయం 10.30గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తారు.
ఫ పెండింగ్ సమస్యల పరిష్కారానికి అవకాశం
ధరణి చట్టంలో ఆర్‌ఓఆర్ మ్యుటేషన్‌లో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ వివాదాలపై అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. భూ భారతిలో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, వారం రోజుల గడువుతో నోటీసులు ఇచ్చి సమస్యను పరిష్కరించడానికి వీలుంది. ధరణి కారణంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను ఈ కొత్త చట్టం ద్వారా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా సాదా బైనామాల ద్వారా పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌లను ఈ చట్టం ద్వారా పూర్తి చేసి పట్టాదారు పాసుబుక్‌లు ఇస్తారని, భూ వివాదాల కారణంగా ధరణిలో కనిపించకుండా పోయిన సర్వే నెంబర్ల సమస్య పరిష్కారమై ఆయా రైతులకు పట్టాదారు పాసు పుస్తకం చేతికి రావడంతో పాటు భూమిపై హక్కులు పొందడానికి ప్రభుత్వం అందించే లబ్ధి పొందడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఈ అంశాలతో పాటు పలు అంశాలు భూ భారతి అవగాహన సదస్సులో చర్చకు వచ్చి రైతులకు సంపూర్ణ అవగాహన చేకూరుతుందని అధికారులు అంటున్నారు. వీలునామా, వారసత్వ మ్యూటేషన్‌లకు తహసీల్ధార్‌లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. భూములపై హక్కున్నా రికార్డుల్లో నమోదు కాకపోయినా సరి చేసుకునే అవకాశం ఉన్నది.