ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టి వార్తల్లో కెక్కిన కొమురంభీం జిల్లా కు చెందిన సూర్యదేవ్ వార్త గుర్తుంది కదా.. అంతా ఈజీగా ఎలా మర్చిపోతామంటారా.. సేమ్ టూ సేమ్ సూర్యదేవ్ స్టైల్ లోనే ఇద్దరు యువతులను ప్రేమించి పెద్దలను ఒప్పించి.. ఒకే పెళ్లి మండపంలో ఇద్దరి మెడలో ఆరుముళ్లేసి భళా అనిపించుకున్నాడు మరో యువకుడు. ఇళ్లంతా పందిరేసి వేలాది మంది బందువులను ఆహ్వానించి బాండ్ రాసిచ్చి మరీ ఇద్దరు యువతులను మనువాడాడు ఆదివాసీ యువకుడు. శుభలేఖలోనూ ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నట్లు ఒకే కార్డ్‌పై ముద్రించి బందువులను భారీగా ఆహ్వానించాడు. రెండు వేల మంది అతిథుల సాక్షిగా ఆ ఇద్దరి యువతుల మెడలో మూడు ముళ్లు.. స్వారీ ఆరు ముళ్లేసి ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా మారాడు ఆత్రం చత్రుషావ్ అనే యువకుడు. ఈ విచిత్ర పెళ్లితంతు కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసార ఆదివాసీ గ్రామంలో చోటు చేసుకుంది.
అడ్డెసార పూనగూడకు చెందిన జంగుబాయి, ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వీ గ్రామానికి చెందిన సోన్ దేవి అనే యువతులను ఒకేసారి ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఆత్రం చత్రుషావ్. వీళ్ల మధ్య నాలుగేళ్ల కిందట చిగురించిన ప్రేమ ఆరు ముళ్లతో ముగ్గురిని ఒక్కటి చేసింది. అలా అని ఆ ఇద్దరు యువతులు అక్కా చెల్లెల్లో.. స్నేహితులో కాదు.. ఇద్దరు వేరు వేరు గ్రామాలకు చెందిన యువతులు. ఆ ఇద్దరి యువతుల ఆలోచన విధానం కూడా వేరే.. అయినా ఆ ఇద్దరిని ఒప్పించి ఆ ఇరువురు యువతుల కుటుంబాలను మెప్పించి ఈ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు యువకుడు చత్రుషావ్.
ఒక్క అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే గగనంగా మారిన ఈ రోజుల్లో ఇద్దర్ని ప్రేమించి.. ఒకే పెళ్లి మండపంలో ఒకే సమయంలో మనువాడడం సూపర్ అంటున్నారు ఈ పెండ్లి వేడుక చూసిన అతిథులు. అంతే కాదు ఈ ఇద్దరికీ భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకుంటానని ఓ బాండ్ పేపర్ కూడా రాసి ఇవ్వడం మరింత చర్చనీయాంశం అయింది. ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు ఆ ఒప్పందానికి ఒకే చెప్పడంతో ఇదిగో ఇలా ముగ్గురు వివాహ బంధంతో ఇలా ఒకటయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…