విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ రాబోతుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నెం. 2 ఎవరంటే అందరి నోట లోకేష్ పేరే వినిపిస్తోంది. పార్టీ కోసం తెర వెనుక లోకేష్ ఎంతగానో కష్టపడుతున్నారు. 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కూటమి గెలుపులో కీలక పాత్రను పోషించిన లోకేష్.. టీడీపీ అధికారంలోకి వచ్చాక మరింత యాక్టివ్ అయ్యారు. ఓవైపు ప్రజలతో మమేకం అవుతూనే.. మరోవైపు ఏపీకి పెట్టుబడులు తెచ్చి ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తెర వెనుక ఉన్న లోకేష్ ను తెర ముందుకు తీసుకురావాలని.. ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలని ఇటీవల టీడీపీ శ్రేణులు గట్టిగా వాయిస్ వినిపించారు. కానీ, జనసేన నుంచి అభ్యంతరాలు రావటంతో ఈ అంశం పై ఎవరూ చర్చ చేయవద్దని పార్టీ నాయకత్వం ఆదేశించింది. అయితే తాజాగా తనయుడి విషయంలో బాబు భారీ వ్యూహం రచించారట. లోకేష్ ను తెర ముందుకు తెచ్చి తాను సైడ్ అవ్వాలని బాబు భావిస్తున్నారట.

అందులో భాగంగానే మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతలను లోకేష్ కు అప్పగించబోతున్నారట. తద్వారా పార్టీ భావి నాయకుడు లోకేష్ అనే సంకేతాలు ఇవ్వబోతున్నారని బలంగా టాక్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలను పల్లా శ్రీనివాస్ కు ఇవ్వగా.. తెలంగాణలో ఓ నేతకు తాత్కాలిక బాధ్యతలు ఇచ్చారు.
అయితే మే నెలలో మూడు రోజుల పాటు అట్టహాసంగా జరగబోయే మహానాడు వేడుకల్లో నారా లోకేష్ కు రెండు రాష్ట్రాల టీడీపీ అధ్యక్ష పదవులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించనున్నారని సమాచారం అందుతోంది. జాతీయ అధ్యక్షుడి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కు అన్ని రకాల హక్కులు కల్పించేలా చర్యలు కూడా తీసుకోబోతున్నారట. తద్వారా ఏపీ రాజకీయాల్లో లోకేష్ పాత్ర మరింత పెరగనుందని అంటున్నారు. కాగా, ఈసారి మహానాడు వేడుకలను కడపలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది తొలి మహానాడు కావడంతో పార్టీ ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.