నరమేధానికి ఉగ్రవాదులు బైసరన్‌ లోయ ఎంచుకోవడం వెనుక అసలు కారణం ఇదే!

Written by RAJU

Published on:

జమ్ము కశ్మీర్ ఉగ్రదాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు పక్కా ప్లాన్‌తో దాడి చేశారా? టూరిస్టుల ఐడీ కార్డులు ఎందుకు చెక్‌​ చేశారు? ఏకంగా 28 మందిని పొట్టన పెట్టుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉందా? అసలేం జరిగింది? సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. బైసరన్‌ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులభంగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కల్పించింది. ఇక్కడి పచ్చదనం పాడవ్వకూడదన్న ఉద్దేశంతో మోటార్‌ వెహికిల్స్‌ను అనుమతించరు. పహల్గామ్ టౌన్‌ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ లోయకు వెళ్లాలంటే కాలినడకన వెళ్లాలి. లేదంటే పర్యాటకులు పొట్టి గుర్రాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేశాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో, ఊహించని ఘటనలు జరిగినప్పుడు చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. మంగళవారం(ఏప్రిల్ 22) కూడా సరిగ్గా అదే జరిగింది.

ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్‌తో బైసరన్‌ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది. సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన ఉగ్రమూకలు.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయి. బాడీక్యామ్‌లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోట చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేసినట్లు చెప్తున్నారు.

బైరసన్‌ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో బాధితుల తరలింపు ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ లోపు దట్టమైన అడవుల్లో నుంచి ఉగ్రవాదులు పారిపోయారు. జమ్ము కశ్మీర్‌లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరున్న బైసరన్‌ వ్యాలీపై ఈ ఘటనతో నీలినీడలు అలుముకున్నాయి.

బైసరన్‌ వ్యాలీకి‌ మినీ స్విట్జర్లాండ్‌గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్‌ అల్పైన్‌ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. ట్రెక్కింగ్‌ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీన్నే ఆసరగా చేసుకున్న ఉగ్రమూక నరమేధం సృష్టించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights