దిశను గ్యాంగ్‌రేప్‌ చేసి చంపేశారు.. శివసేన నేతపై దిశ తండ్రి సంచలన ఆరోపణలు..!

Written by RAJU

Published on:

మహారాష్ట్ర రాజకీయాల్లో బాలీవుడ్‌ స్టార్‌ సుశాంత్‌ రాజపుత్‌ మేనేజర్‌ దిశా సాలియన్‌ అనుమానాస్పద మృతి ఘటన మళ్లీ ప్రకంపనలు రేపుతోంది. దిశా మృతికి శివసేన ఉద్దవ్‌ వర్గం నేత ఆదిత్య ఠాక్రే కారణమని ఆమె తండ్రి సతీశ్‌ సాలియాన్‌ ముంబై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన కూతురిని గ్యాంగ్‌రేప్‌ చేసి చంపేశారని సతీష్‌ సాలియాన్‌ ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని కోరారు. ఆదిత్య ఠాక్రేకు నార్కో టెస్ట్‌ నిర్వహించాలని కోరారు. మహరాష్ట్ర అసెంబ్లీలో ఈ వ్యవహారంపై బీజేపీ, శివసేన ఉద్దవ్‌ వర్గం ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్దం నడిచింది.

2020 జూన్‌ 8న తన కూతురు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసిందని.. దానికి ఆదిత్య ఠాక్రేతో పాటు అతని బాడీగార్డులు, నటులు సూరజ్‌ పంచోలి, డినో మోరియా సహా మరికొందరు హాజరయ్యారని తాజాగా పిటిషన్‌లో పేర్కొన్నారు. దిశా లైంగిక వేధింపులకు గురైందని, తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని సతీష్ సాలియన్ ఆరోపించారు. దిశా తండ్రి ఆరోపణలకు ఆదిత్య ఠాక్రే సమాధానం చెప్పాలని మహారాష్ట్ర మంత్రి నితేష్‌ రాణే డిమాండ్‌ చేశారు. అయితే ఈ ఆరోపణలను శివసేన ఉద్దవ్‌ వర్గం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజా సమస్యలు , నాగ్‌పూర్‌ అల్లర్లలో వైఫల్యం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు పార్లమెంటు సభ్యులు ప్రియాంక చతుర్వేది.

ఐదేళ్ల క్రితం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అంతకంటే వారం రోజుల ముందు దిశా కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. 2020 జూన్ 8న ముంబైలోని ఓ భవనంపై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. దిశా చనిపోయిన రోజుల వ్యవధిలోనే నటుడు సుశాంత్ తన ఫ్లాట్‌లో శవమై తేలారు. దిశా హత్యాచారంతో సుశాంత్‌ ఆత్మహత్యను ముడిపెడుతూ అప్పటి ఉద్దవ్‌ ఠాక్రే సర్కార్‌ను బీజేపీ టార్గెట్‌ చేసింది. ఉద్దవ్‌ ఠాక్రే సర్కార్‌ ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification