– ధరణి స్లాట్ రద్దు చేసుకున్న వారి ఎదురుచూపు
– రెండేళ్లుగా రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు
– జిల్లాలో జమ కావాల్సినవి సుమారు రూ. 38.60 లక్షలు
జగిత్యాల, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని బుగ్గారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 2022 అక్టోబరులో సిరికొండ గ్రామ శివారులో గల ఎకరం భూమి సేల్ డీడ్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఇందుకు 32,000 రూపాయలు ఈ చాలన్ చెల్లించాడు. సదరు భూమి అమ్మిన వ్యక్తి మృతి చెందడంతో స్లాట్ రద్దు చేసుకున్నాడు. అయితే స్లాట్ రద్దు చేసుకున్నా సంబంధిత డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగివేసారి పోతున్నాడు.
ఫ జిల్లాలోని కొడిమ్యాల మండలంలోని పూడూరు అనుబంధ గ్రామమైన ఆరపల్లికి చెందిన ఓ రైతు తన తండ్రి పేరున ఉన్న సుమారు ఎకరంన్నర వ్యవసాయ భూమి విరాసత్ చేసుకోవడానికి 2023 నవంబరు నెలలో ధరణి స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఇందుకు గానూ సుమారు 67 వేల రూపాయలు ఈ చాలన్ రూపంలో చెల్లించాడు. కాగా వ్యక్తిగత కారణాల వల్ల విరాసిత్ చేయించుకోలేకపోయాడు. సంబంధిత స్లాట్ రద్దు చేసుకున్నా డబ్బులు తిరిగి రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాడు. ఇలా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు స్లాట్ బుకింగ్ క్యాన్సిల్ డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
సాగు భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకొని అనివార్యకారణాలతో రద్దు చేసుకున్న వారికి తిరిగి డబ్బులు రావడం లేదు. జిల్లాలో సుమారు 389 మంది డబ్బుల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. డబ్బులు వాపస్ చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిందే తప్ప ఆచరణలోకి తేవడం లేదు. వెరసి బాధితులు కలెక్టరేట్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా, వేగంగా చేయడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 సంవత్సరంలో ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ధరణి వెబ్‌సైట్‌కు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. పలు రకాల సేవల కోసం స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. భూమి విలువ ప్రకారం ఎకరానికి సేల్ డీడ్ అయితే 7.5 శాతం, గిఫ్ట్ డీడ్ అయితే 6.5 శాతం, మ్యుటేషన్ అయితే 2,500 రూపాయలు చెల్లించాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత కొందరు వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ ధరణి పోర్టల్‌లోకి వెళ్లి స్లాట్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటున్నారు. ఈ విధంగా రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకున్న వారికి చలానా డబ్బులు పది రోజుల్లో వారి ఖాతాలో జమ కావాల్సి ఉంది. కానీ జిల్లాలో ఎక్కడా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
రావాల్సిన నగదు వివరాలు ….
జిల్లాలో దరణి స్లాట్ రద్దు చేసుకున్న సుమారు 389 మందికి సుమారు రూ. 38,60,196 రావల్సి ఉంది. వీటిలో నాలా కన్వెర్సన్ స్లాట్ క్యాన్సిల్, సక్సెసన్ (వారసత్వం) స్లాట్, పార్టీషన్ స్లాట్ తదితర స్లాట్‌లను క్యాన్సిల్ చేసుకున్న వారు ఉన్నారు. వీరంతా కొంత కాలంగా క్యాన్సిల్ చేసుకున్న స్లాట్ డబ్బుల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
స్లాట్ బుకింగ్ రద్దుకు కారణాలివే…
స్లాట్ బుకింగ్ సమయంలో ఏవైనా తప్పులు నమోదైనా, ఆధార్ కార్దులో ఈకేవైసీ సమస్య తలెత్తినా, సంబంధిత భూములు కోర్టు కేసుల్లో ఉన్నా రిజిస్ట్రేషన్ చేయరు. విక్రయదారుడు, కొనుగోలుదారుడి మధ్య ధరల విషయంలో వివాదం, వివాదస్పద భూమి అయి ఫిర్యాదులు, వారసత్వ భూముల విషయంలో సమస్యలు, మిస్సింగ్ సర్వే నంబరు, ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లు కనబడకపోవడం తదితర వాటితో పాటు వ్యక్తిగత కారణాలతో స్లాట్ బుకింగ్‌లు రద్దు చేసుకుంటున్నారు.
బాధితులకు దొరకని పరిష్కారం…
స్లాట్ బుకింగ్ రద్దు చేసుకున్న వారికి లావాదేవీలు రద్దయిన పక్షంలో వివరాలు అందించే వ్యవస్థ ఎక్కడా లేదు. ఫిర్యాదులు స్వీకరించే విభాగం సైతం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకున్న వారిలో చాలా మందికి డబ్బులు వాపస్ రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమస్యతో జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా అధికారులు ప్రభుత్వానికి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు నివేదిక పంపుతున్నప్పటికీ నగదు వాపస్ రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుకొని రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దు చేసుకున్న వారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Updated Date – Apr 12 , 2025 | 02:16 AM