వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 11వ తేది ముప్పవరపు వెంకయ్య నాయుడు జరిపించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా మధ్యాహ్నం అతిథులు, ఆహుతులకు బ్రహ్మాండమైన మాంసాహార విందు పెట్టి అందరి మనసు దోచారు. చికెన్ బిర్యాని, మటన్ కుర్మా, చికెన్ ఫ్రై, రొయ్యల పులుసు, కొరమీను పులుసు చివరన కిళ్లీకి బదులుగా తేగలు, రేగుపండ్లు పెట్టారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన సినీ నటులు చిరంజీవి, రాజేంద్రప్రసాద్, ఆలీ అయితే నెల్లూరు నాన్‌వెజ్ రుచి బ్రహ్మాండమన్నారు’ మాంసాహారంతో మనసు దోచిన వెంకయ్య శీర్షికన 2011 జనవరి 14న జమీన్ రైతు పత్రికలో వచ్చిన వార్తాకథనం ఇది.
‘భోజనాంతే మధురసం’ అని ఆయుర్వేద సూక్తి. తీపి రుచి కలిగిన వాటిని భోజనం చివర్లో తినాలి. స్వీటుని ముందు వడ్డించినా ఆఖరునే తినాలని శాస్త్రం. తేగలు తీపి రుచి కలిగి ఉంటాయి. వీటిలో ఫైబరు దండిగా ఉండి, తీసుకున్న ఆహారం తేలికగా అరిగేలా చేస్తుంది. తెలుగువారి పెద్దాయన వెంకయ్యనాయుడు భోజనాంతరం తేగలు పెట్టడం శాస్త్రపరంగా ఒక మంచి ఆచారం.
బొరాస్సస్ ఫ్లాబెల్లిఫర్ అనే వృక్షనామం కలిగిన తాటిచెట్టు అరికేసీ కుటుంబానికి చెందిన మొక్క. గీతపెడితే అందులోంచి నీరా ద్రవం వస్తుంది కాబట్టి బొరాస్సస్ అనీ, విసనకర్ర లాంటి ఆకులు ఉంటాయి కాబట్టి ఫ్లాబిల్లిఫెరా అనీ పేరు పెట్టారు. దీని లేత వేళ్లే తేగలు. వీటిని గేగులు, గేంగులు అని కూడా పిలుస్తారు. తమిళం, మలయాళాల్లో తాయ్, తుళు భాషలో దాయ్ అంటారు. వీటిని తంపట వేసి గానీ, కాల్చిగానీ తింటే రుచిగా ఉంటాయి.
తేగలకు అనేక ద్వంద్వ ప్రవృత్తులున్నాయి. ఇవి వేడిని తగ్గించి చలవ నిస్తాయి. కానీ అతిగా తింటే ఎసిడిటీ పెంచుతాయి. జీర్ణశక్తిని కలిగించి ఆహారం తేలికగా అరిగేలా చేస్తాయి. కానీ, అతిగా తింటే ఆకలిని చంపుతాయి. బలాన్ని పుష్టినీ కలిగిస్తాయి కానీ, అతిగా తింటే జీర్ణశక్తి మందగించి తిన్నది వంటబట్టకుండా పోతుంది. విరేచనం సరిగా కానివారికి అయ్యేలా చేస్తాయి. నీళ్ల విరేచనాల్లో నీటి శాతాన్ని తగ్గించి శోష రాకుండా కాపాడతాయి. కాల్చిన తేగల్ని మిక్సీ పట్టి గంజిలో కలిపి తాగిస్తే నీళ్ల విరేచనాలు ఆగుతాయి, మూత్రంలో మంట తగ్గుతుంది. తేగల్ని పైపైన మిక్సీ పట్టి, నీళ్లలో వేసి టీ కాచుకుని తాగితే కఫం తగ్గుతుంది. అతిగా తింటే కఫం పెరిగి ఆయాసం, ఉబ్బసాలు కలుగుతాయి.
పరిమితంగా తీసుకుంటే ఉన్మాదం, హిస్టీరియా లాంటి మానస వ్యాధుల్లోను, అమీబియాసిస్, గ్యాస్ట్రయిటిస్ లాంటి జీర్ణకోశ వ్యాధుల్లోనూ ఇవి మేలు చేస్తాయి. కడుపులో పెరిగే నులిపురుగుల్ని చంపే గుణం కూడా వీటికుందని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. తేగలు శుక్రపుష్టి నిచ్చి, పురుషుల్లో జీవకణాల్ని పెంచుతాయి.
విటమిన్ బి 6, పొటాషియం వీటిలో ఎక్కువ. ఇందులో కొవ్వు పదార్థాలుండవు, అందుకని ఆయుర్వేద గ్రంథాలు బెల్లంతో గానీ నెయ్యితో గానీ తినాలన్నారు. బెల్లం ముక్క నంజుకుంటూ తేగలు తింటే ఎలాంటి జబ్బూ చెయ్యదు. తేగల్ని వివిధ వంటకాల్లో కూడా చేర్చుకోవచ్చు. వీటి గుజ్జుని నేతితో వేగించి కూరల్లో కలిపి వండుకోవచ్చు. ముక్కల్ని మెత్తగా ఉడికించి పెరుగు కలిపి తాలింపు పెట్టిన కమ్మని తాటి తేగల రైతా (పెరుగుపచ్చడి) గొప్ప ఆహార ఔషధం. తేగల్లోని ఫైబర్, పెరుగులోని మంచి బ్యాక్టీరియా (ప్రోబయటిక్) రెండూ కలగలసిన ప్రీబయటిక్ ప్రోబయటిక్ ఔషధం ఇది. ఇందులో కొద్దిగా ఆవపిండి కలిపితే మరింత కమ్మగా ఉంటుంది.
సీజనల్‌గా దొరికే ఈ తేగలు గొప్ప ఎనర్జీ బూష్టరుగా పనిచేస్తాయి. తేగలది దొడ్డమనసు. శరీరానికే కాదు మనసుకూ సంతృప్తినిస్తాయి.
– డా. జి వి పూర్ణచందు, 94401 72642