TS ICET 2025 Exam Dates : తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ మార్చి 6వ తేదీన విడుదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.

తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ ఐసెట్-2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైంది. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టీఎస్ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవిలు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సహకారంతో నల్గొండ నుండి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే టీజీ ఐసెట్ 2025-26 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి 10వ తేదీ ప్రారంభమై.. మే 3వ తేదీ వరకు కొనసాగుతుంది.
ముఖ్యమైన తేదీలు :
మార్చి 10 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 అపరాధ విషయంతో మే 17 వరకు అవకాశం కల్పించారు. రూ.500 అపరాధ రుసుముతో మే 26 వరకు అవకాశం కల్పించారు. అనంతరం ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మే 16 నుంచి 20 వరకు వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 షిఫ్టుల్లో రాష్ట్రవ్యాప్తంగా జూన్ 8, 9 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. జూన్ 21న పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 22 నుంచి 26 వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జులై 7న TG ICET 2025 ఫలితాలను విడుదల చేస్తారు.