ఎదుటి వారిలో తప్పులు ఎంచడం చాలా తేలిక.. కానీ.. మన తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దడం మాత్రం కష్టం. అచ్చం ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా మూడు తప్పులు జగన్ వైపు ఉన్నాయని చెబుతున్నారు. తాను తప్ప ఏపీ ప్రజలకు ప్రత్యామ్నాయం లేదని.. కూటమి వ్యతిరేకతే తనకు లాభిస్తుందని ఆయన లెక్కలు వేసుకుం టున్నారు. అందుకే.. తన రాజకీయ దూకుడు కనిపించడం లేదు.
అయితే.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం లేనంత మాత్రాన.. ఉన్న పార్టీకే ఓట్లేయాలని ప్రజలు ఎక్కడా అనుకోవడం లేదు. అలానే అనుకుంటే.. కేంద్రంలో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకైక పార్టీ.. కాంగ్రెస్. కానీ, ప్రజలు మోడీపై ఇష్టం ఉన్నా లేకున్నా.. బీజేపీకే ఓట్లు వేస్తున్నారు. 2019లో అప్రతిహతి విజయం అందుకున్న మోడీ.. 2024కు వచ్చే సరికి 230 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. అంటే.. నిజానికి ప్రత్యామ్నాయం లేకపోయినా.. కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపలేదు.

ఈ విషయాన్ని జగన్ గుర్తించలేక పోతున్నారు. మరో కీలక విషయం.. క్షేత్రస్థాయిలో పార్టీని ముందుకు నడిపించక పోవడం. ఈ క్రమంలో టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీలో ఇంకా.. బలమైన నాయకులు లేరనే చెప్పాలి. బలం అంటే ఆర్థికంగా, కులం ప్రకారం కాదు. బలమైన దృక్ఫథం ఉన్న వారు.. మన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలి.. అని భావించే నాయకుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ వెనుకబడింది. ఈ విషయాన్ని కూడా జగన్ మరిచిపోతున్నారు.
ఇక, తాను అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని చెబుతున్నారు జగన్. దీనికి చంద్రబాబును కూడా ఆయన చూపిస్తున్నారు. నిజమే. చంద్రబాబు కూడా.. సభను ఏడాదిన్నర పాటు బాయికాట్ చేశారు. కానీ, అప్పటి చంద్రబాబు ప్రకటన రాజకీయంగా ప్రజల్లో సెంటిమెంటును రాజేసింది. ఇది 2024లో విజయానికి బాటలు వేసింది. కానీ.. ఇప్పుడు జగన్.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అందుకే తాను సభకు వెళ్లడం లేదని అంటున్నారు. ఇది ప్రజలకు ఎక్కడం లేదు. సో.. ఈ మూడు తప్పులు ఆయన సరిచేసుకుంటే తప్ప.. రాజకీయంగా మనుగడ కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.