– బరిలో ఐదుగురు
– మంత్రుల ఆధిపత్యపోరులో పైచేయి ఎవరిదో?
– జిల్లాపై రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి దృష్టి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ… జిల్లాలో మాత్రం ప్రత్యర్థి పార్టీలదే పైచేయి.. జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలుంటే రెండింటిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. ఉన్న ఒక్క ఎంపీ స్థానంలో బీజేపీకి చెందిన నేత గెలుపొంది కేంద్రంలో మంత్రి పదవిని అధిష్టించారు. చేతిలో ఉన్న సిట్టింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ తాజాగా తన్నుకొని పోయింది. ఇదీ జిల్లాలో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి..
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం మీనాక్షి నటరాజన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆమె ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేయతలపెట్టారు. ప్రపథమంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న విషయం తెరపైకి వచ్చింది. ఈ పదవి కోసం ప్రస్తుతం శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ చైర్మన్‌గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురమల్ల శ్రీనివాస్, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఎవరినైనా అధ్యక్షుడిగా ఎంపిక చేసి బాధ్యతలు అప్పగిస్తారా మరెవరినైనా తెరపైకి తెస్తారా అన్నది కాంగ్రెస్‌లో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పూర్తికాలం పనిచేసే కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానవర్గం భావిస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో మంథని నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హుస్నాబాద్ నుంచి గెలుపొందిన పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రులుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఇద్దరు మంత్రులు ఉన్నా ప్రస్తుతం కరీంనగర్‌లో ఈ జిల్లా మంత్రి ఎవరంటే కాంగ్రెస్ శ్రేణుల నుంచి వచ్చే సమాధానం ఎవరో అనే… ఇద్దరు ఇక్కడి రాజకీయాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తూ వస్తుండడంతో వారిద్దరి మధ్య ఆధిప్యత పోరు మొదలైంది. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు రెండు, మూడు సార్లు రావడం మినహా ఆయన పెద్దగా ఇక్కడి రాజకీయాలను పట్టించుకున్నది లేదు.
మంత్రుల మధ్య కుదరని సఖ్యత
మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఒకరి జోక్యాన్ని ఒకరు ఒప్పుకోక పోవడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నది. వేదికలపై, గాంధీభవన్ సమావేశాల్లో ఐక్యతారాగాలను వినిపించినా ఇద్దరి వ్యవహారశైలి కడుపులో కత్తులు దాచుకొని కౌగిలించుకున్న మాదిరిగా ఉంటున్నదని పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, శ్రేణులు బాహటంగానే చెప్పుకుంటున్నాయి. శ్రీధధర్‌బాబు సుడా చైర్మన్‌గా నరేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చెప్పి నియామకం చేయించడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనను ససేమిరా అంగీకరించేది లేదంటూ కొద్దినెలల పాటు నరేందర్‌రెడ్డిని కలువడానికి కూడా అంగీకరించలేదు. ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనే సమావేశాలకు నరేందర్‌రెడ్డికి ఆహ్వానాలు ఉండడం లేదని పార్టీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిలు పురమల్ల శ్రీనివాస్, వెలిచాల రాజేందర్‌రావు మొదట్లో పొన్నం ప్రభాకర్‌తో సన్నిహితంగానే ఉన్నా ఆయన అనుచరులుగానే కొనసాగుతూ వచ్చినా ఇటీవలి కాలంలో ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. వెలిచాల రాజేందర్‌రావు ఈ రాజకీయాలకు దూరంగా పట్టించుకోనట్టు ఉంటూ వస్తూ ఉండగా పురమల్ల శ్రీనివాస్ తిరుగుబాటు ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహారశైలిని తప్పుబట్టి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు మంత్రుల రాజకీయాలు డీసీసీ అధ్యక్ష నియామకంపై కూడా పనిచేస్తున్నాయి. కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి శ్రీధర్‌బాబు ఆశీస్సులుండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనను అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. పద్మాకర్‌రెడ్డి పొన్నం వర్గీయుడిగా ముద్రపడడంతో శ్రీధర్‌బాబు ఆమోదం ఆయనకు లభించడం కష్టమే అంటున్నారు. పురమల్ల శ్రీనివాస్‌ను కూడా పొన్నం ప్రభాకర్ అంగీకరించే అవకాశం లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన డీసీసీ అధ్యక్షుడిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఎలా నియమిస్తారు.. ఎవరికి అవకాశమిస్తారు అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
పరిస్థితి చక్కదిద్దడంపై పార్టీ ఫోకస్
అధ్యక్షుడి నియామకం కంటే ముందు జిల్లాలో పార్టీ పరిస్థితి చక్కదిద్దడంపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంత్రులిద్దరి వ్యవహారం చక్కదిద్దే అవకాశం లేకపోలేదని కూడా అనుకుం టున్నారు. ఇటీవల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి అధిష్టానవర్గానికి ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న పరిస్థితులపై నివేదిక పంపించారు. జిల్లాలో కాంగ్రెస్‌కు సమన్వయపరిచే నేతలు లేరని అంతో ఇంతో మంత్రి శ్రీధర్‌బాబు తన గెలుపుకోసం ప్రయత్నిం చారని, పార్టీ కార్యకర్తలు అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను కలిసేందుకు కూడా కొందరి అనుమతులు తీసుకోవలసిన పరిస్థితి ఉందని, పార్టీ వ్యవస్థను చక్కదిద్దాల్సిన అవసరమున్నదని ఆయన మీడియా సమావేశంలో ప్రకటించి సమగ్రమైన నివేదికను పార్టీకి సమర్పించారు. అందులో ఏ విషయాలు పేర్కొన్నారన్న విషయం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశమున్నది. జిల్లా కాంగ్రెస్‌కు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఏ మందు వేస్తారో చూడాల్సిందేనని పార్టీశ్రేణులు చర్చించు కుంటున్నాయి.