టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌..! విద్యార్థులకు మంచి టిప్స్ ఇచ్చిన ఐఏఎస్‌ ఆఫీసర్‌

Written by RAJU

Published on:

టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌..! విద్యార్థులకు మంచి టిప్స్ ఇచ్చిన ఐఏఎస్‌ ఆఫీసర్‌

ఇంటికి దీపం ఇల్లాలు ఎలాగో, సమాజానికి మహిళా అధికారులు దివిటీలుగా వ్యవహరిస్తారన్న పదాలకు సరైన అర్థం చెబుతున్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా. మహిళల సమస్యలు పరిష్కరించడంలో బాలికలకు, విద్యార్ధినులకు ప్రోత్సాహం అందించడంలో తన అధికారిక సేవలను వినూత్నంగా అందిస్తున్నారు. ముఖ్యంగా విద్యాసంవత్సరం ముగింపు దశలో పరీక్షల సమయంలో విద్యార్థినుల్లో మనోధైర్యం నింపేందుకు వారితో కలిసి మాట్లాడుతున్నారు. విద్య ఆవశ్యకతను తెలియజేస్తూ విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతున్నారు.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసే సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులతో ఈ నెల ఒకటో తేదీన జూమ్ మీటింగ్ నిర్వహించిన కలెక్టర్, ఇప్పుడు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సారి ప్రత్యక్షంగా వారితో కలిసి కొంత సమయాన్ని గడిపారు. ఒంగోలులోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధినులతో కలెక్టర్ తమీమ్‌ అన్సారియా మాట్లాడారు. పరీక్షలంటే ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా, సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని విద్యార్థునులకు సూచించారు.

విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని చేరుకోవడానికి, ఉన్నత విద్యాభ్యాసానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పాస్‌పోర్ట్‌ లాంటివని కలెక్టర్ అన్నారు. ఈ పరీక్షలు బాగా రాయాలని ” ఆల్ ది బెస్ట్ ” చెప్పి విద్యార్థినులలో స్ఫూర్తిని నింపారు. ప్రతీ ఆడపిల్ల కనీసం డిగ్రీ పూర్తి చేయాలని కోరారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ఆయా కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను జిల్లా యంత్రాంగం కల్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట ప్రకాశం జిల్లా విధ్యాశాఖాధికారి కిరణ్ కుమార్, జిల్లా కామన్ ఎగ్జామినేషన్స్ బోర్డు కార్యదర్శి శ్రీనివాసరావు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Subscribe for notification